GHMC | సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : లోకసభ ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. దీంతో శుక్రవారం నుంచి అభివృద్ధి పనులకు లైన్ క్లియర్ కానున్నది. షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో జీహెచ్ఎంసీలో అభివృద్ధికి సంబంధించిన కొత్త పనులు దాదాపు మూడు నెలల పాటు నిలిచిపోయాయి. అప్పటికే కొనసాగుతున్న పనులు మాత్రమే యథావిధిగా కొనసాగాయి. వాస్తవంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాక కొత్త ప్రాజెక్టులకు అంకురార్పణ జరగలేదు. కనీసం సీఎం రేవంత్రెడ్డి శాఖ పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీకి సంబంధించిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఏ ఒక్క రోజూ సమీక్షించిన దాఖలాలు లేవు.
దీంతో గడిచిన ఆరు నెలలుగా కొత్త ప్రాజెక్టులు లేక, పురోగతిలో ఉన్న కీలకమైన ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు పూర్తికి నోచుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాదాపు మూడు నెలల పాటు అభివృద్ధి పనులు కుంటుపడగా.. ప్రస్తుత లోకసభ ఎన్నికలతో మరో మూడు నెలల పాటు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీనికి తోడు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నామమాత్రంగా జీహెచ్ఎంసీపై సమీక్ష నిర్వహించగా, సీఎం రేవంత్రెడ్డి బల్దియాను పట్టించుకున్న పాపాన పోలేదు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం ప్రాజెక్టులపై సమీక్షించిన దాఖలాలు లేవు.
వెరసి జీహెచ్ఎంసీలో అభివృద్ధి కుంటుపడి ప్రజా సమస్యలు మరిన్ని ఉత్పన్నమయ్యాయని పౌరులు వాపోతున్నారు. దీనికి తోడు అధికారులు ఎన్నికల పేరుతో అసంపూర్తి పనులను సైతం గాలికి వదిలేయడంతో ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఈ వర్షాకాలంలో నాలా, వరద నీటి సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతున్నది.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రతి వారంలో ఒక రోజు స్టాండింగ్ సమావేశం ఉంటుంది. అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్ల సభ్యులతో ఉండే ఈ సమావేశంలో రహదారుల విస్తరణ, సీఎస్ఆర్ల భాగస్వామ్యంతో చెరువులు, పార్కుల అభివృద్ధి, ఫుట్పాత్ ఆధునీకరణ, జంక్షన్ల అభివృద్ధి, నాలా, మురుగునీటి మళ్లింపు తదితర పనులపై నిర్ణయం తీసుకుంటారు. దాదాపు రూ. 2-3 కోట్ల అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అయితే ఎన్నికల నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే కోడ్ ముగియనుండటంతో వచ్చే వారంలో స్టాండింగ్ కమిటీ సమావేశం ఉంటుందా? లేకపోతే ఆలస్యం చేస్తారా? అన్న చర్చ నడుస్తోంది.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఎన్నికల కోడ్ పేరుతో రద్దు చేశారు. దీంతో ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి నిలిచిపోయింది. ప్రజావాణిలో ఎక్కువగా డబుల్ బెడ్ర్రూం ఇండ్లు, ఆస్తిపన్ను , అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి మళ్లీ నిర్వహించి, ఆయా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వారానికో రెండు వారాల్లో పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకుంటారు. దీంతో పౌరులకు కాస్తంత మేలు జరుగుతుంది. అయితే వచ్చే సోమవారం నుంచి ప్రజావాణిని తిరిగి నిర్వహిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.