మేడ్చల్, మే 9 : మేడ్చల్ జీహెచ్ఎసీ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్లో పూడూరు నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శనివారం ఆందోళన నిర్వహించారు. వంద మంది వరకు పూడూరు వాసులు పార్టీలకు అతీతంగా పూడూరు నుంచి డంపింగ్ యార్డు వరకు నిరసన ప్రదర్శన జరిపి, ఆందోళన నిర్వహించారు. చెత్తను తీసుకొచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ పూడూరు గ్రామంలో ఇందిరా గాంధీ హయాంలో 381, 382 96 ఎకరాల స్థలాన్ని దళితులు, బీసీలకు సాగు కోసం కేటాయించారని తెలిపారు. అందులో ఎస్సీలకు 28 ఎకరాలు ఉందన్నారు.
గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ప్రతి ఊరిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి స్థలం కేటాయించారన్నారు. ప్రస్తుతం పూడూరు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో సర్కిల్ పరిధిలోని చెత్తనే కాకుండా మియాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి కూడా చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారని తెలిపారు. విచ్చలవిడిగా చెత్తను డంప్ చేయడంతో కేవలం ఎకర స్థలం 9, 10 ఎకరాలకు చెత్త విస్తరించిందని తెలిపారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా చెత్తను తగులబెడుతుండటంతో పూడూర పరిసర ప్రాంతాలు కలుషితమవుతున్నాయన్నారు.
చెత్తను డంపింగ్ చేస్తున్న ప్రాంతానికి సమీపంలో నల్సార్ యూనివర్సిటీ, ఐపీఈ కళాశాల, నివాస గృహాలు, వెంచర్లు ఉన్నాయని తెలిపారు. చెత్త డంపింగ్ ఇలాగే కొనసాగితే పర్యావరణం, చెరువులు, భూమి, భూగర్భ జలాలు కలుషితమై మనుగడ కొనసాగించడంతో కష్టతరం అవుతుందన్నారు. పూడూరు మరో జవహర్‌నగర్‌గా మారకముందే చెత్త డంపింగ్ ఆపి, 15 రోజుల్లో ఇప్పుడు ఉన్న వ్యర్థాలను తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు వినతి పత్రాలు కూడా సమర్పించామని తెలిపారు.
అధికారులు స్పందించకపోతే చెత్తను జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద డంప్ చేసి, ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సుధాంశు మాట్లాడుతూ పూడూరులో తాత్కాలికంగా సర్కిల్ పరిధిలోని చెత్తను తరలిస్తున్నామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని, వారం పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబు యాదవ్, మాజీ ఉప సర్పంచ్‌లు మానేపల్లి వెంకటేశ్, శేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, తూపాల కృష్ణ, శ్రీకాంత్, శేషుకుమార్, గోపాల్ యాదవ్, జనార్దన్ యాదవ్, స్థానికులు సాయికుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.