తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 28: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేసి జీవో 9ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, విద్యార్థి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్‌పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం చేపట్టిన నిరసనలో ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. 76ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఇంకా అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. హైకోర్టు స్టే ఇస్తుందని ఆశించాం కానీ స్టే ఇవ్వకపోవడం విచారకరమన్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు బీసీలకు 42శాతం కలిపిస్తామని ఊరువాడ ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఆశలు కల్పించి, ఎన్నికల మేనిఫెస్టోలో ముద్రించి ఇంటింటి ప్రచారంలో సభలలో వాగ్దానం చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు విస్మరించడం సిగ్గు చేటన్నారు. మంత్రివర్గంలో తీర్మానాలు చేసి రాజ్యాంగబద్ధంగా జీవో జారీ చేసి బిహార్ ఎన్నికలు ముగియగానే చడిచప్పుడు కాకుండా రిజర్వేషన్లను 42శాతం నుంచి 22శాతం తగ్గిస్తూ మరో జీవో 46ను తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జీవో 46కారణంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు.
పలు జిల్లాల్లో అనేక మండలాల్లో, గ్రామాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్, వార్డు సభ్యుని సీటు కూడా కేటాయించలేదని సుమారు 1200 సర్పంచ్ పదవులు దక్కకుండా పోయాయని ఆయన వివరించారు. బీసీలకు ఇంతకన్నా పెద్ద మోసం మరొకటి లేదని ఆయన వాపోయారు. తక్షణమే ఎన్నికలు రద్దు చేయకుంటే బీసీల తడాఖా చూపిస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మొదటి నుండి కాంగ్రెస్ ప్రవర్తన అనుమానాస్పందంగా ఉందని, అసెంబ్లీ తీర్మానం అనంతరం అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి తీసుకువెళ్ళలేదని, హైకోర్టులో రిజర్వేషన్ల కేసు నడుస్తుందని సాకులు చెబుతూ తీర్పు రాకముందే ఎన్నికలకు ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేకనే రిజర్వేషన్లు అమలు చేయలేదనే విషయం తేటతెల్లమయిందని అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూ ర్యాపేట, మంచిర్యాల, ఆదిలాబాద్, భూపాలపల్లి, మహాబూబాబాద్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో బీసీలకు దక్కిన రిజర్వేషన్లే ఉదాహరణలు అని వివరించారు. బీసీలు ఐక్యంగా ఓటుతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, డాక్టర్ ఆర్.అరుణ్‌కుమార్, కొండా దేవన్న, భూమన్నగౌడ్, గుజ్జ సత్యం, రాజేందర్, అనంతయ్య, మోడీ రాందేవ్, బాణాల అజయ్, లింగం యాదవ్, రాజునేత, శివకుమార్, అంజిగౌడ్, నిఖిల్, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.