సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నగరంలో కల్తీ మద్యం ముఠా గుట్టును హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…నగరంలో పెద్దఎత్తున కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు గత రెండురోజులుగా నగరంలోని అమీర్‌పేట, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతా ల్లో రూట్‌వాచ్ నిర్వహించారు.
అమీర్‌పేట, కృష్ణానగర్‌లో జరిపిన తనిఖీల్లో అటుగా వెళ్తున్న మనీష్, పవన్‌ల వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా..అందులో 9 ఖరీదైన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. పట్టుబడిన మద్యం ఖరీదైనది కాదని, అది నకిలీ మద్యమని వెల్లడించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, సాయినగర్‌లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు.
ఈదాడుల్లో ఖరీదైన ఖాళీ మద్యం సీసాల్లో నకిలీ మద్యం నింపుతున్న ఒరిశాకు చెందిన రుద్రప్రతాప్ రౌత్, సత్యప్రకాశ్రౌత్, రింకుజాన్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఖరీదైన 14మద్యం బాటిళ్లు, 63ఖరీదైన ఖాళీ మద్యం సీసాలు, మూతలు, లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.8లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే నిందితులు పలు బార్లు, వైన్‌షాపుల్లో పనిచేస్తూ అక్కడ ఉన్న ఖాళీ సీసాలు, వాటి మూతలు సేకరించి గత కొంత కాలంగా ఈ నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు.
నకిలీ మద్యం పట్టుకున్న వారిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్, అమీర్‌పేట సీఐ బానోతు పటేల్, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ మల్లికార్జున్, కానిస్టేబుళ్లు కరణ్, శ్రీకాంత్, గోపాల్, అక్షర తదితరులు పాల్గొన్నారు. కాగా, నకిలీ మద్యం పట్టుకున్న సిబ్బందిని ఈ సందర్భంగా ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.