ఇటీవల బాలికలపై వేధింపులు అధికమయ్యాయి. తల్లిదండ్రులు అనుక్షణం తమ బిడ్డలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే.. కొన్ని పాఠశాలల పక్కనే మద్యం దుకాణాలు ఉండడంతో తాగిన మత్తులో చాలా మంది ఇప్పటికే న్యూసెన్స్ చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు సైతం పోలీసులకు అందాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలోని చిన్నారులు తెలిసో తెలియకో అటువైపునకు వెళితే మత్తులో ఉన్న రాబందులు ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టే ప్రమాదం లేకపోలేదు. ఇందుకు తాజా ఉదాహరణ పక్క చిత్రం. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల పక్కనే బార్ ఉండడంతో ఆందోళన కల్గిస్తున్నది.
సిటీబ్యూరో/సికింద్రాబాద్, జూన్ 17 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా కిల్లికొట్టులు తెరిచినట్టు తెరిచేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా తమను అడిగేవారే లేరంటూ అడ్మిషన్ల దందాతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు. సాధారణంగా పాఠశాల నెలకొల్పాలంటే మద్యం దుకాణాలకు దూరంగా ఉండాలి. కానీ ఆ దుకాణాన్నే ఆనుకొని ఉన్న పాఠశాల ప్రారంభానికి అనుమతిచ్చింది హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ.
సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాల మద్యం దుకాణాన్ని ఆనుకొని ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికారులకు మద్యం దుకాణం కనిపించలేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొంతమంది అధికారులు ప్రైవేట్ పాఠశాలలు ఇచ్చే డబ్బులకు ఆశపడి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ బోర్డులు పెట్టి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. డీడీ కాలనీలో ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డుతో ఓ పాఠశాల అడ్మిషన్ల దందాకు తెరలేపింది.
యథేచ్ఛగా దందా..
ఇటీవల హైదరాబాద్ విద్యాశాఖ అధికారు లు గత అకడమిక్ ముగియనున్న చివర్లో లంగర్ హౌజ్‌లోని 800 మంది విద్యార్థులు చదువుతున్న ఆర్చిడ్స్ స్కూల్‌కు అనుమతి లేదని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏడాది వరకు కొనసాగినా అధికారులకు కనిపించని స్కూల్ చివర్లో మాత్రం రద్దు చేయడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా చందానగర్‌లోని రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నిబంధనలకు పాతరేసి అడ్మిషన్ల దందా చేస్తున్నది. భవనానికి గాని.. స్కూల్‌కు ఎటువంటి అనుమతు లు లేకున్నా యథేచ్ఛగా పాఠశాల నిర్వహిస్తుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలి చింది. గ్రేటర్లో చాలా పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదులు చేశారు.
నిబంధనలకు పాతర..
పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుకాణాలు, ప్రార్థన మందిరాలకు దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. భవన రిజిస్ట్రేషన్, అగ్ని మాపకం తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులు పూర్తి చేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని ఫిర్యాదులు అందినా డీఈఓలు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాణాలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా పాఠశాలలను నిర్వహిస్తున్నా తమకు పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు.