హైదరాబాద్: హైదరాబాద్‌లో ముసురు (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, హస్తినాపురం, ఉప్పల్, సంతోష్నగర్తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, రుతుపవన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 2.89 సెంటీమీటర్లు, రామచంద్రాపురంలో 2.08 సెం.మీ., కూకట్‌పల్లిలో 1.8 సెం.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.