Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వర్షం( rains ) కురిసింది. కొన్ని చోట్ల రాత్రి 7:30 గంటల సమయంలో వాన కురియడంతో, జనాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది.
శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు పగటి పూట 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోతాదు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 9వ తేదీ నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.