సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : వాహనం అవసరంగా మారిపోయింది. ఒకే ఇంట్లో నాలుగైదు వాహనాలు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లాంటి నగరంలో ఇక వాహనాల వినియోగం చెప్పక్కర్లేదు. బైకులు, కార్లు నాలుగైదుకు మించి ఉంటున్నాయి. గ్రేటర్లో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 85 లక్షలకు మించి వాహనాలు ఉన్నాయి. వాహనాలన్నీ రోడ్డెక్కితే ట్రాఫిక్ సమస్య. ఆ వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యంతో వాతావరణ సమస్య.
ఇవే వాహనాలు ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ వద్ద నిలుస్తే ఇంకా పెద్ద సమస్య అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల వినియోగం తగ్గించడం మన చేతుల్లో లేకున్నా.. కాలుష్య తీవ్రత తగ్గించడంలో క్రమశిక్షణ పాటించాలని పర్యావరణ వేత్తలు, ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. గ్రేటర్‌లోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సిగ్నల్ పడితే వాహనాల ఇంజిన్ ఆపాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. 20 సెకన్లకు మించి సిగ్నల్ ఉంటే ఇంజిన్ ఆపకపోతే విష వాయువులను ఉత్పత్తి చేసిన వారిమే కాకుండా ఆ కాలుష్యాన్ని పీల్చి అనారోగ్యబారిన పడే ప్రమాదం పొంచి ఉందని అవగాహన కల్పిస్తున్నారు.
ఇంజిన్ ఆపకపోతే..
నగరంలోని సాధారణ ప్రాంతాలతో పోల్చితే ఒక్కో సిగ్నల్ వద్ద 25 శాతానికి పైగా అధిక కాలుష్యం వెలువడుతుందని పర్యావేరణవేత్తలు చెబుతున్నారు. ఇలా నగరంలో ప్రతి రోజూ 1500 టన్నుల పొగ పోగవుతున్నట్టు గతంలో సర్వేలు సైతం వెల్లడించాయి. అనవసరంగా ఇంజిన్ ఆన్‌లోనే ఉంచడంతో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, హైడ్రో కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్, సీసం, కార్బన్ పొడులు గాలిలో కలుస్తున్నాయి. వీటిని పీల్చుకోవడంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ బారినపడాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లో సుమారు మూడు వేలకుపైగా ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో సుమారు 1400 జంక్షన్లలో 30 సెకండ్లకు మించి సిగ్నల్స్ పడుతున్నాయి. కొన్ని సార్లు 2 నిమిషాలు, 30-180 సెకండ్లు కూడా పడుతున్నాయి. ఒక్కో సిగ్నల్ వద్ద గరిష్ఠంగా 150 వరకు వాహనాలు నిలుస్తున్నాయి. ఒక వాహనం 40 పీపీఎం కార్బన్ డయాక్సైడ్ చొప్పున కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఇలా ఒక్కో సిగ్నల్ వద్ద ఆగేవారు 8వేల పీపీఎం కార్బన్ డయాక్సైడ్తో పాటు ఇతర కాలుష్యాన్ని పీల్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
రవాణా శాఖ అధికారుల అవగాహన..
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీఏ అధికారులు వాహనదారులకు అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలతో పాటు వాహన కాలుష్యంపైనా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రత్యక్షంగా శరీరానికి గాయాలవడమే ప్రమాదం కాదనీ.. పరోక్షంగా వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యం మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బండి ఇంజిన్ ఆపడం వంటి క్రమశిక్షణ పాటించాలని సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ప్రతీ వాహనం పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని వివరిస్తున్నారు. ప్రతీ వాహనం రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఒక ఏడాది వ్యవధి ముగిసిన తర్వాత చెల్లుబాటు అయ్యే పీయూసీ కలిగి ఉండాలి. పీయూసీ పరీక్ష తర్వాత సర్టిఫికెట్ జారీ అవుతుంది. కాలం చెల్లిన వాహనాలు నడిపితే కఠిన చర్యల ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వాహనాల వారీగా కాలుష్యం విడుదల
వాహనం : కాలుష్యం శాతాల్లో
ద్విచక్రవాహనాలు : 56.02
ఆటోలు : 34.00
పెట్రోల్ కార్లు : 12.00
డీజిల్ కార్లు : 2.00
ట్రక్కులు : 18.85
బస్సులు : 1.54
ఇతర వాహనాలు : 0.26