సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్ లోటస్పాండ్లో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఏఈ జ్యోతిర్మయి, మెడికల్ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే అడిషనల్ కమిషనర్ లేక్స్ శివకుమార్ నాయుడు, ఈఈ శంకర్ రావులతో కలిసి సెయిల్ అనెక్స్ హోటల్ వద్ద మొక్కలు నాటారు. తార్నాక డివిజన్లో కమిషనర్ ఆమ్రపాలి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాటికి 3053.58 టన్నుల చెత్తను తొలగించినట్లు బల్దియా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 707 స్వచ్ఛ ఆటోలను షాప్స్, కమర్షియల్, ఆర్డబ్ల్యూఏకు అటాచ్ చేశామన్నారు.