సిటీబ్యూరో, అక్టోబరు 19 (నమస్తే తెలంగాణ) : ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది..అటు చేరికలు, ఇటు ప్రచారంలో అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ టాప్‌గేర్‌లో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు అడగడుగునా పూలవర్షంతో సాదరస్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుతున్నారు.
ఒకవైపు సమావేశాలు మరోవైపు చేరికలతో పార్టీలో జోష్ పెంచారు. ఈ నేపథ్యంలోనే డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడం, ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు. 22 నెలలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అంటూ ప్రచారాన్ని హీటెక్కించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థులకు వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు.
బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న నేతలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే బూత్ స్థాయిలో బలమైన క్యాడర్‌తో ఉండగా, మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా డివిజన్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే కేటీఆర్ అన్ని డివిజన్ల నేతలతో సమావేశమై దిశానిర్ధేశం చేయగా..ఇంటింటి పాదయాత్రలో అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల అవస్థలు, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరిస్తున్నారు.
ఒకవైపు ఇంటింటి పాదయాత్రలు జోరుగా నిర్వహిస్తూనే మరో పక్క రెండు జాతీయ పార్టీల నుంచి బీఆర్ఎస్కు ఆకర్షిలవుతున్న నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ మేరకు టీడీపీ నుంచి ప్రదీప్ చౌదరి.. కేటీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి చెరుకు మహేశ్‌తో పెద్ద సంఖ్యలో బీజేపీ మహిళా మోర్చా నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. బోరబండ డివిజన్ సీనియర్ ఎంఐఎం నేత షేక్ మునీర్ , రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన వ్యాపారి చాంద్‌తో పాటు 200 మంది కేటీఆర్ సమక్షంలో చేరారు. షేక్‌పేట డివిజన్ నుంచి వివిధ స్థాయిలో నాయకులు భారీ ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆదివారం ఎల్లారెడ్డి గూడకు చెందిన బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు అంజిబాబు, పల్లవి దంపతులు ఆదివారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంజిబాబు గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఎస్పీ తరపున పోటీ చేసి భారీగా ఓట్లు సాధించారు.
మాగంటి సునీతా గోపీనాథ్‌కు బ్రహ్మరథం..
బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాగంటి సునీతా గోపీనాథ్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీతాను గెలిపించుకుని గోపీనాథ్‌కు అసలైన నివాళులర్పించాలని ఆయన అభిమానులు, శ్రేణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనలకు అనుగుణంగా సునీతా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. ఈ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించగా..ప్రచార శైలిని ఎప్పటికప్పుడు వార్ రూం వేదికగా పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణులతో మాట్లాడి భారీ మెజార్టీ లక్ష్యంగా దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్‌ను ప్రకటించగా.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.