మేడ్చల్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ప్రచారానికి తరలివెళ్తున్నారు. మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అనే బ్రహ్మాస్థ్రంతో బుద్ధిచెప్పాలని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి ఆపార్టీ చేసిన మోసలను వివరిస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తరలివెళ్తుతున్నారు.
ఇన్చార్జిలుగా జిల్లా ఎమ్మెల్యేలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యేలైన చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిని కొన్ని ప్రాంతాలకు బీఆర్ఎస్ అధిష్టానం ఇన్చార్జిలుగా నియమించింది. దీంతో వారంతా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులతో ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి రెహ్మత్‌నగర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి శ్రీనగర్‌కాలనీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బోరబండ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎర్రగడ్డ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 303 నుంచి 310 వరకు పోలింగ్ బూత్‌ల ఇన్చార్జిగా వ్యహరిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్కు మద్దతు కూడగడుతున్నారు.
సోమాజిగూడ డివిజన్లో..
నేరేడ్మెట్, అక్టోబర్ 14: జూబ్ల్లీహిల్స్ బైఎలక్షన్లో భాగంగా సోమాజిగూడ డివిజన్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత రాముయాదవ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.