వనస్థలిపురం, జూన్ 4 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న హడావిడి శంకుస్థాపనలతో కాంగ్రెస్ పార్టీ అభాసుపాలవుతోంది. రూ.కోట్లతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి పట్టుబటి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును తీసుకువస్తున్నారు. సహజంగా మంత్రికి ఉండే పని ఒత్తిడి వల్ల సమయం ఇవ్వలేని పరిస్థితి. కానీ ఆయన సమయం ఇచ్చేవరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఆపి, మంత్రి సమయం ఇచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నారు. కాగా కార్యక్రమం ఉన్న కాలనీలో ప్రజలు, ఆ ప్రాంత నాయకులు, కార్యకర్తలు మంత్రి కోసం గంటల తరబడి పడిగాపులుండగా, సాయంత్రానికి వచ్చిన మంత్రి నిమిషాల్లో కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోతున్నాడు. ఉదయం నుంచి వేచి చూసినవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రజలతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర బాబు సమయం ఇస్తే తప్ప ఇక్కడ పనులు ప్రారంభం కావడం లేదన్న విమర్శలున్నాయి. మంత్రి పర్యటన అనడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాలనీవాసులు ఒక రోజు ముందునుంచి సిద్ధమవుతున్నారు. ఉదయం సమయమిచ్చిన మంత్రి ఏ సాయంత్రానికో వస్తే అప్పటివరకు పనులు మానుకుని పడిగాపులు ఉండాల్సి వస్తుంది. అంతా అయినంగా వచ్చిన మంత్రి హడావిడిగా కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోతున్నాడు. గతంలో మంత్రి పర్యటన సందర్భంగా హస్తినాపురంలో పెద్ద ఎత్తున స్టేజీ వేసి, సభను ఏర్పాటు చేశారు. సభ వద్దకు వచ్చిన మంత్రి వేదిక వద్దకు కూడా రాకుండా వెళ్లిపోయాడు. దీంతో సభకు వచ్చిన క్యాడర్, సమస్యలు చెబుదామనుకున్న ప్రజలు తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. ఇలాంటి సంఘటన నేపథ్యంలో మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో పర్యటించగా ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, మరో కార్పొరేటర్ సుజాత నాయక్, పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొనకపోవడం గమనార్హం.
కోట్లాది నిధులతో చేపట్టిన ఎన్నో పనులు శంకుస్థాపనలు, ప్రారంభాలకు నోచుకోకుండా ఉండగా, కొన్ని పనులను మాత్రమే ప్రారంభించి మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. హస్తినాపురం డివిజన్లోని వందనపురి కాలనీ నుంచి నాలా నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించకుండా పెండింగ్‌లో ఉంది. దాంతోపాటు సాగర్ రింగ్‌రోడ్‌లో ఉన్న ఫ్లై ఓవర్‌కు కనెక్ట్ చేస్తూ నిర్మించిన ఫ్లై ఓవర్ పూర్తయ్యి, ప్రారంభం కాకుండా కొన్ని నెలలుగా ఉంది. చంపాపేట్ డీ మార్ట్ వద్ద నాలా నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు షురూ కాలేదు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లో పదుల సంఖ్యలో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. చాలా డివిజన్లలో కోట్లాదిగా నిధులు మంజూరై పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. అలాంటి వాటిని వదిలేసి తూతూ మంత్రంగా, హడావిడి చేసి మంత్రితో మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, పనులను త్వరితగతిన ప్రారంభించి, పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎల్బీనగర్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఒక మంచి సంప్రదాయం ఉండేది. ప్రజలకు, సంక్షేమ సంఘాలకు ఇబ్బంది లేకుండా ఉదయమే పూర్తి చేసేవాళ్లం. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రజలతో కలిసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ఆర్భాటం తప్ప ఏమీ కనిపించడంలేదు. మంత్రి సమయం ఇవ్వకున్నా పట్టుబట్టి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా అరాచకం చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పలుకుబడిని తగ్గించాలని కుట్ర చేస్తున్నారు. కానీ అది విఫలయత్నమే అవుతుంది. కాలనీల్లో ప్రజలు సుధీర్‌రెడ్డి రావాలని కోరుతున్నారు. ఇకనైనా కుటిల రాజకీయాలు మాని అభివృద్ధికి పాటు పడాలి.