Devireddy Sudheer Reddy | మన్సురాబాద్, మే 25: పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికి ఏదో ఒక సమయంలో సముచిత స్థానం దక్కుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి. పాండుగౌడ్ ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ పరిధి మోహన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు ఐక్యతతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కొత్తపేట డివిజన్లో పార్టీ ఎంతో బలోపేతంగా ఉందని తెలిపారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు.