MLA Sudheer Reddy | వనస్థలిపురం, మే 4 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఫేజ్4 ఆర్చి వద్ద వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారులు దూసరి మధుగౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువత భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడు కరెంటు పోలేదని, ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నాయకులు వారి సంస్కారం మరచిపోయి మాట్లాడుతున్నారని, తాము ఓపికతో చూస్తున్నామని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి విషయంలో పోటీ పడాలి, కానీ చిల్లర మాటలతో రాజకీయాలు చేయొద్దని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ మరెక్కడా లేవని తెలిపారు. వనస్థలిపురంలోనే ఉన్న పార్కులు మరెక్కడా లేవని తెలిపారు. నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.