లే అవుట్ పర్మిషన్ నుంచి బిల్డింగ్ ఓసీ వరకు ఒకప్పుడు ఆన్లైన్ వేదికగా ప్రక్రియ సాగిపోయేది. కానీ ప్రజాపాలన వచ్చాక ప్రాపర్ చానల్ విధానంలో జరుగుతున్నది. హెచ్ఎండీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాడోల కనుసైగల్లో నిర్మాణ రంగ అనుమతులు వస్తున్నాయన్న చర్చ బిల్డర్లలో ఆసక్తికరంగా సాగుతున్నది. గాడిలో పడిన ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా అనుమతులు జారీ కావాల్సిన చోట ప్రభుత్వంలో పెద్దల సహకారంతో షాడో నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. చేపట్టే ప్రాజెక్టు ఎంత విస్తీర్ణంలో ఉందనేది పక్కనే పెడితే… ఎవరి పైరవీతో వచ్చిందనే అంశాన్ని ఉన్నతాధికారులు ప్రయార్టీగా తీసుకుంటున్నారన్న చర్చ హాట్ హాట్‌గా సాగుతున్నది. అందుకు అనుగుణంగానే ఫైళ్లను కదలిస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం నిర్వీర్యమైందనే వాదనలకు ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. అధికారుల సిఫార్సులు, షార్ట్ ఫాల్స్ పక్కన పెడితే… షాడో నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప… ఫైళ్లకు మోక్షం దొరకడం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. షాడో నేతలు ఓకే అంటే తప్ప.. ఫైళ్లను ముట్టుకునేవారే లేకపోగా, కనీసం ఫైల్ స్టేటస్ కూడా తెలుసుకునే పరిస్థితి హెచ్ఎండీఏలో లేకుండా పోయింది.
– సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ)
హెచ్ఎండీఏలో కొందరి ఉన్నతాధికారుల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాళ్లు చేయాలనుకున్నదే ఫైల్, చేసిందే సంతకం అన్నట్లు అనుమతుల విషయంలో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా కమిషనర్, జాయింట్ కమిషనర్ పర్యవేక్షణలో జరగాల్సిన వ్యవహారాలన్నీ సీఎం సన్నిహితుల చేతుల మీదుగా జరుగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. లే అవుట్, భవన నిర్మాణ అనుమతుల విషయంలో, సంస్థ చేపట్టే భారీ ఇంజినీరింగ్ ప్రాజెక్టుల టెండర్ల రూపకల్పన వరకు అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇలా స్వతంత్రంగా జరిగిపోవాల్సిన వ్యవహారాలన్నీ బడా షాడో నేతల పైరవీలతో జరిగిపోతున్నాయి. ప్రాపర్ చానల్ కాకుండా వెళ్లిన వారికి లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల విషయంలో చుక్కెదురు అవుతున్నది. ప్రభుత్వ పెద్దకు షాడోగా, మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హెచ్ఎండీఏ వ్యవహారాలన్నీ చేతి వేళ్లపై నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండీఏ అధికారుల పనితీరులో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతుంటే.. అంతగా అవినీతికి ఆస్కారం ఉండేది కాదు. ఇప్పటికీ ఆన్లైన్ విధానం అందుబాటులో ఉన్నా.. సంబంధిత ఫైళ్లకు షాడో నేతలు ఒకే చెబితేనే… మోక్షం వస్తుంది. చివరకు హెచ్ఎండీఏ కమిషనర్ పరిధిలో జరగాల్సిన వ్యవహారాలను కూడా షాడో నేతలే నిర్దేశిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారి ఆదేశానుసారమే ఉన్నతాధికారులు కూడా అడుగులు వేస్తూ ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. గతంలోనూ ఇదే తీరుగా రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో 17 ఎకరాల లే అవుట్ చేసిన బిల్డర్‌కు ఇదే రీతిలో చేదు అనుభవం ఎదురైంది. లే అవుట్‌కు సంబంధించి కిందిస్థాయి నుంచి కమిషనర్ ద్వారా తిరిగి చివరకు లే అవుట్ నిర్మాణానికి అనుమతి దక్కింది. ఆ లే అవుట్‌కు సంబంధించి రోజులు గడుస్తున్నా.. నేటికీ డీసీ లెటర్ మాత్రం రిలీజ్ కాలేదు. అదేమంటే త్రూ ప్రాపర్ చానల్ అంటూ ఆ ముగ్గురు పేర్లు సదరు బిల్డర్లకు వినబడ్డాయి. ఇదొక్కటే కాదు ఐదు ఎకరాల పైబడిన లే అవుట్, లే అవుట్ కం హౌసింగ్, ఐదు లక్షల ఎస్ఎఫ్టీతో కూడిన బిల్డింగ్‌లన్నీ హెచ్ఎండీఏలో కాకుండా త్రూ ప్రాపర్ చానల్ ద్వారానే అనుమతులు దక్కుతున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
హెచ్ఎండీఏకు భారీ ఆదాయాన్ని తీసుకువచ్చే వాటిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఒకటి. ఇతర జోన్ల నుంచి రెసిడెన్షియల్ జోన్లకు ఆయా భూములను మారుస్తూ ఎంఏయూడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటంది. ఇలా ఇప్పటివరకు దాదాపుగా 690కు పైగా సీఎల్‌యూ ఫైళ్లు ఎంఏయూడీ విభాగంలో మూలుగుతున్నాయి. ఏడాది కాలంలో ఏ ఒక్క ఫైలు కూడా ముందుకు సాగిన పరిస్థితి లేదు. ఈ శాఖకు షాడో మంత్రులుగా వ్యవహారిస్తున్న బడా నేతలు… చెప్పడమే ఆలస్యం… చకచకా ఫైళ్లపై సంతకాలతో ముందుకు పోతున్నట్లుగా తేలింది. అయితే కొన్ని ఫైళ్లకు మాత్రమే ఎందుకు మోక్షం దొరుకుతుందనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో… వాటికి షాడో నేతల అనుగ్రహం పుష్కలంగా ఉందని తేలింది. దీంతోనే ఆ ఫైళ్ల విషయంలో ఆగమేఘాల మీద స్పందించి ఉన్నతాధికారులు చక్కబెడుతున్నారని వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో సర్వే నంబర్ 15-32లో ఉన్న 20 ఎకరాల ఇండస్ట్రీయల్ భూమిని రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలంటూ 2023 కంటే ముందే దరఖాస్తు చేసుకున్నారు. పలు దఫాల స్క్రూటీ తర్వాత… ఏడాది కాలంగా పెండింగ్‌లోనే ఉంది. అయితే ఇటీవల ఈ ఫైలుకు సంబంధించిన వారు షాడో నేత సాయంతో మరోసారి ప్రయత్నం చేసినట్లుగా తెలిసింది. ఎంఏయూడీ ఉన్నతాధికారికి విషయం చేరిందే ఆలస్యం అన్నట్లుగా సంబంధిత ఫైల్‌కు క్లియరెన్స్ నిస్తూ… తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం హెచ్ఎండీఏ పరిధిలోనే అత్యంత వివాదస్పదంగా మారితే… ఎంఏయూడీ ఉన్నతాధికారి పనితీరుకు ఇదొక కొలమానంగా మారింది.