నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా మంగళవారం నాంపల్లి కోర్టులకు చెందిన న్యాయవాదులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగింది. నినాదాలతో అసెంబ్లీ ప్రాంతానికి బయలుదేరిన న్యాయవాదుల్ని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా అడ్డుకుని పోలీసులు చుట్టుముట్టారు. అసెంబ్లీ ముట్టడికి అడ్డుకట్ట వేయరాదని పోలీసుల్ని కోరినప్పటికీ బలవంతంగా న్యాయవాదుల్ని ప్రత్యేక వాహనాల్లో అరెస్టు చేసి అంబర్పేట్, ఐఎస్ సదన్, కాంచన్‌బాగ్, బండ్లగూడ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజ్యవర్ధన్రెడ్డి మాట్లాడుతూ… న్యాయవాదిని అతి కిరాతకంగా నడిరోడ్డు మీద హత్య చేశారని, ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పలుమార్లు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని వినతిపత్రాన్ని సైతం సమర్పించినా ఉలుకూ-పలుకూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది డి.అనంతరఘు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి చెందిన కేసుల్ని వాదిస్తున్నది న్యాయవాదులేనని, న్యాయవాదుల్ని నడిరోడ్డుపై హత్య చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు రవికిశోర్, వేణుగోపాల్, మహిళా న్యాయవాది ప్రొనీత్సింగ్, డి.అనంతరఘు, డి.వెంకటేష్‌తో పాటు సుమారు వంద మందిని అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరలించారు.
అంబర్‌పేట : న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే తీసుకురావాలని పలువురు నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పీఎస్‌లో న్యాయవాదులు సునీతయాదవ్, పద్మావతి, చంద్రమోహన్, శ్రీనివాస్, రమణగౌడ్, మల్లేశ్, వెంకటేశ్ తదితరులు మాట్లాడుతూ..ప్రస్తుతం న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సిద్ధార్థ్ ముదిరాజ్, కె.లింగారావు, ఆకుల మల్లేశం తదితరులు న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు.
కేపీహెచ్‌బీకాలనీ:న్యాయవాదులపై దాడులను అరికట్టేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ కోర్టు న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ మంగళవారం కూకట్పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ప్రతి కోర్టు వద్ద రక్షణ కోసం లైజనింగ్ పోలీస్ ఆఫీసర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ నేతలు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
సైదాబాద్, మార్చి 25: పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయిల్ ను హత్య చేసిన నిందితుడిని మంగళవారం ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… చంపాపేట ఈస్ట్ మారుతీనగర్ శ్రీనివాస అపార్ట్మెంట్లో ఎర్రబాపు ఇజ్రాయిల్ (56) నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా గా పనిచేసే కాంతారావు, భార్య కళ్యాణితో గత కొంతకాలంగా మారుతీనగర్ కు చెందిన ఎలక్టిష్రన్ గులాం దస్తగిరి (46) వివాహేతర సంబంధం కలిగిన ఉన్నాడు. దీంతో దస్తగిరి తప్పులను ఎత్తి చూపినందుకు న్యాయవాది ఇజ్రాయిల్ పై కక్ష పెంచుకుని హత్య చేసినట్లు తెలిపారు. వివాహేతర సంబంధం కలిగిన మహిళతో న్యాయవాది చనువుగా ఉన్నాడని కక్షతో పధకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడి నుంచి కత్తి , ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుమార్తె ద్రాక్షవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడు గులాం దస్తగిరిని రిమాండ్ కు తరలించారు. సౌత్ అదనపు డీసీపీ టి.స్వామి, సంతోష్ నగర్ ఏసీపీ మహ్మద్ గౌస్ పర్యవేక్షణలో ఐ ఎస్ సదన్ ఇన్స్పెక్టర్ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చర్లపల్లి, మార్చి 25:కుటుంబ కలహాలతో తండ్రిని ఓ కొడుకు హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల తెలిపిన ప్రకారం.. కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాయినగరలో నివాసముండే పాత్లవత్ శంకర్(54)ఆటో నడుపుతూ నివాసముంటున్నాడు. కాగా, మంగళవారం ఇంట్లో కుటుంబ కలహాలతో కుమారుడు జగదీశ్ తండ్రి శంకర్‌ను గొంతు నుమలమడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శంకర్‌ను పరీక్షించగా..అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.