నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది. గత సంవత్సరంలో హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో నెలకు 13 నుంచి 15 వరకు హత్యలు జరగగా ఈసారి ఆ శాతం 20కి చేరడం గమనార్హం. ఇలా మహానగరంలో నిత్యం ఏదో ఒకచోట హత్యలు, దోపిడీలతో పంజా విసురుతున్న అంతర్ ర్రాష్ట్ర ముఠాలు, రౌడీషీటర్ల గ్యాంగ్వార్లు, రెచ్చిపోతున్న సెల్ఫోన్, చైన్ స్నాచర్లు, అంతకంతకూ పెరిగిపోతున్న గంజాయి మూకల అరాచకాలు నగరంలో శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
– సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్లో వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి నేడు తిరిగి పునారవృతమవుతు న్నాయి. వ్యవస్థీకృత నేరాలను ఉక్కుపాదంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేసింది. దీంతో హైదరాబాద్లో దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగ్లు, దృష్టి మళ్లించి దొంగతనాల వంటి నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంతర్ర్రాష్ట్ర ముఠాలు బెంబేలెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ పోలీసుల దెబ్బకు ఈవైపే కన్నెత్తి చూడని అంతర్ర్రాష్ట్ర ముఠాలు ఇప్పుడు వరుసగా ఏదోఒక ఘటనకు పాల్పడుతూనే ఉన్నాయి.
ఒక సర్వే ప్రకారం హైదరాబాద్లో మహిళలపై లైంగిక వేధింపులు, లైంగికదాడులు ఇతర నేరాలకు సంబంధించి దేశంలోని ప్రధాన నగరాల్లో సర్వే చేస్తే 30 శాతం నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే మహిళలు ఇంటి ముందు కూడా కనీసం ఒంటరిగా కొద్దిసేపు కూర్చోలేని దుస్థితి నెలకొంది. పగలు తేడా లేకుండా స్నాచింగ్ ముఠాలు హైదరాబాద్లో పెట్రేగిపోతున్నాయి. గంజాయి బ్యాచ్లు ఒంటరిగా కన్పించే మహిళలను ఏడ్పించడం, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, నాలుగురోజుల కిందట మల్కాజిగిరి సీపీ సుమతి ఆపరేషన్ నగరంలో మహిళల భద్రత డొల్లతనాన్ని చాటిచెప్పింది. దిల్షుఖ్నగర్లో సుమతి ఒక సాధారణ మహిళగా అర్ధరాత్రివేళ నిలుచుంటే ఆమెను 40 మంది ఆకతాయిలు వేధించిన వైనం భాగ్యనగరంలో పరిస్థితికి అద్దం పడుతున్నది.