మణికొండ, జూలై 30: అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే పదిరోజులు గడిచింది. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. చిక్కిందంటూ అటవీశాఖ అధికారులు చెబుతుండగా.. అప్పుడే తప్పించుకుందంటూ మరో వార్త ప్రచారంలోకి వస్తుంది. గంటల వ్యవధిలో పది నుంచి పదిహేనూ కిలోమీటర్ల దూరం వరకు జనవాసాలను తప్పించుకొని పులి పరుగులు పెడుతుందా? అంటూ సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
పదిరోజుల క్రితం మంచిరేవులలోని ట్రెక్పార్కు అటవీ ప్రాంతంలో కన్పించిన పులి రెండురోజుల పాటు అక్కడే తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరుసటిరోజు అవుటర్ సర్వీసురోడ్డు దాటిందని ప్రచారం జరిగింది. అంతలోనే నార్సింగి మీదుగా గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ నిర్మానుష్య ప్రాంతంలో కన్పించినట్లు సీసీ కెమెరాల్లో కన్పించడంతో ఆ ప్రాంత ప్రజలు అప్రత్తమైయ్యారు. అంతలోనే రెండు రోజులు గడవకముందే మరోసారి మంచిరేవుల ట్రెక్‌పార్కులో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
తాజాగా కోకాపేట సబితానగర్ గుట్టలల్లో పులి తిరిగిన ఆనవాళ్లు కన్పించినట్లు అటవీశాఖ అధికారులు నిర్దారించినట్లు తెలిపారు. ఇంతకీ పులి ఒక్కటేనా.. రెండుమూడు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. గంటల వ్యవధిలోనే ఇంతమంది జనవాసాల మధ్యలో నుంచి పులి పది కిలోమీటర్ల దూరం వరకు పరుగులు పెడుతుందా? అనేది సందేహమే. ఒంటరిగా తిరుగాలంటూనే ప్రజలు భయపడుతున్నారు. ప్రజలల్లో అవగాహన పెంచాల్సిన అటవీశాఖ అధికారులు అదిగో పులి.. ఇదిగో అంటూనే పర్యటిస్తున్నారు. పట్టుకున్నామంటూ ప్రచారం చేస్తూనే అప్పుడే తప్పించుకుందంటూ అధికారులు చెబుతుండటమేమిటనీ ప్రశ్నిస్తున్నారు.
అడవిని వదిలి.. జనారణ్యంలోకి
చిల్కూరు మృగవని అటవీ ప్రాంతాన్ని వదిలి పక్కనే ఉన్న అవుటర్ రింగ్‌రోడ్డును దాటి ట్రేక్పార్కులోకి పులి వచ్చిందా? లేక ఇక్కడే పులి ఉందా? అనే అనుమానాలున్నాయి. వేలాది వాహనాలు, వందలాది మంది తిరుగుతున్న ఈ ప్రాంతంలో ప్రతి క్షణం శబ్దాలతో కిక్కిరిసే ప్రాంతాన్ని దాటి కోకాపేట సబితానగర్ వరకు పులి వచ్చిందని అటవీశాఖ అధికారులు నిర్దారించారు. అడవి ప్రాంతాన్ని వదిలి కాంక్రీట్ జంగిల్లో పులి సంచరిస్తుండటంపై చర్చనీయాంశంమైయింది.
చుట్టుపక్కల గ్రామాల్లో అలజడి..
కోకాపేట సమీపంలోని సబితానగర్ గుట్టలో బుధవారం తెల్లవారు జామున మధు అనే వ్యక్తి పులిని చూసినట్లు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు అవును అది పులి ఆనవాళ్లే అంటూ చెప్పారు. దీంతో ఖానాపూర్, వట్టినాగులపల్లి, అగ్నిపూర్(మేకన్‌గడ్డ) ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు మంచిరేవుల, నార్సింగి, గంధంగూడ, గోల్కోండ ఆర్టిలరీ సెంటర్ ప్రాంతాలల్లో తిరిగిన పులి ఇక్కడ ఎలా వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు.
అయోమయంలో అటవీశాఖ అధికారులు
పూటకో చోట చిరుతపులి కన్పిస్తుండటంతో అటవీశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. ఎక్కడా ఇలాంటి సంఘటనలు తమకు ఎదురుకాలేదని అంటున్నారు. పదిరోజులుగా అన్నిచోట్లా పర్యటిస్తున్నా ఆనవాళ్ల ఆచూరే తప్ప అంతుచిక్కడం లేదని అధికారులు వాపోతున్నారు. అడవి ప్రాంతాలన్నీ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్‌గా అవతరించడంతో పులులు, జింకలు, నెమళ్లు జనావాసాల మధ్యలో తిరుగుతున్నాయని వాటిని పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.