Hyderabad | మణికొండ,జనవరి 4: సర్కారు స్థలాల్లో గుడిసెలు, చిన్న ఇళ్లు కట్టుకుని క్రమబద్దీకరించుకున్న వారి వివరాలను సేకరిస్తున్న అధికారులకు నకిలీపట్టాల బండారం బయటపడింది. పూర్తిగా విచారణ చేపట్టగా ఏకంగా అప్పటి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పట్టాలను సృష్టించారని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండలం కోకాపేట గ్రామ సర్వేనంబరు 147లో గతంలో ప్రభుత్వం 80 గజాల చొప్పున అర్హులైన పేదలకు 2006లో ఇండ్ల పట్టాలను మంజూరు చేసింది.
ఈ ప్రాంతంలో చాలామంది పేదలు ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ సర్వే నంబర్లోనే కొన్ని కుల సంఘాలకు అప్పట్లో సర్కారు కమ్యూనిటీ హాళ్లు నిర్మించుకునేందుకు కేటాయింపులు చేసింది. ఇదిలావుండగా మంజూరు చేసిన ఇంటి పట్టాల కన్నా రెట్టింపు స్థాయిలో కొందరు కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొంతమంది వ్యక్తులు సర్వేనంబర్ 147లో 80 గజాల చొప్పున కొన్ని ప్లాట్లకు మార్కింగ్ వేసి ఇండ్లు కట్టుకుంటున్నారు. అధికారులు ఆ పట్టాలను పరిశీలించగా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన హరీష్ సంతకంతో జారీచేసిన పట్టాగా గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్ష చేయించగా, ఆ కలెక్టర్ సంతకం కాదని తెలిసింది.
నిజానికి అప్పట్లో ఇండ్ల పట్టాలనే కేటాయించలేదని తేలింది. ఈ వ్యవహారం వెనుక కోకాపేట గ్రామానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్, నార్సింగి గ్రామానికి మరో మాజీ కౌన్సిలర్ ఇద్దరు కలిసి ఎనిమిది(8) నకిలీ పట్టాలను సృష్టించి దాదాపు వెయ్యి గజాల ప్రభుత్వ స్థలాన్ని వేర్వేరుగా కబ్జాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరికి గత తహసీల్దార్ వెన్నంటే ఉండి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దినట్లు తెలిసింది. కోకాపేటలో గజం ధర రూ.1.50లక్షలు నుంచి రూ. 2లక్షల వరకు పలుకుతున్న విషయం అందరి తెలిసిందే. సుమారు రూ.10కోట్ల విలువైన సర్కారు స్థలాన్ని నకిలీ పట్టాలను సృష్టించి క్రయవిక్రయాలు జరిపినట్లుగా ఇటీవల గండిపేట రెవెన్యూ అధికారులు చేపట్టిన విచారణలో బయటపడినట్లు తెలిసింది.
గతంలో గండిపేటలో తహసీల్దారుగా విధులు నిర్వహించి పదవీ విరమణ అయిన ఆ అధికారి పుప్పాలగూడలోని నెమలినగర్ కాలనీ సమీపంలోని 60 గజాల కాలనీలోనూ ఈ ఇద్దరు మాజీ కౌన్సిలర్లతో మరో వెయ్యి గజాల స్థలాన్ని ఓ కుల సంఘం పేరుతో నకిలీ పట్టాలను సృష్టించి విక్రయాలు చేసినట్లు సమాచారం. కాగా, కోకాపేట సర్వేనంబరు 147లో నకిలీ పట్టాలుగా రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై నార్సింగి పోలీసులకు గండిపేట రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.