మేడ్చల్, జూలై 4: భూ భారతి సదస్సులకు వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, రేషన్‌కార్డుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ భారతి, రేషన్ కార్డులు, ఎల్ఆర్ఎస్ అంశాలపై కలెక్టర్, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మండలాలు, మున్సిపాలిటీల వారీగా భూ భారతి, రేషన్ కార్డులు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ కు గల కారణాలను తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఎల్ఆర్ఎస్ పెండింగులను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన చోట మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు సంబంధించిన కోర్టు కేసులను, లిటిగేషన్ లో ఉన్న ప్రభుత్వ భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, తన దృష్టికి తీసుకురావాలన్నారు.
భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను తిరస్కరించేందుకు గల కారణాలను తెలుపుతూ నివేదికలు పంపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల గురించి కలెక్టర్ ఆరా తీస్తూ త్వరితగతిన రేషన్ కార్డులు పరిశీలించి, అర్హులైన వారికి మంజూరు చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ కట్టిన వారికి ప్రొసీడింగ్స్ అందించాలని, అవసరమైన వాటికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, ఆర్డీవోలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాశ్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.