సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): శివారు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లే లక్ష్యంగా నకిలీ డాక్యుమెంట్లను, నకిలీ వ్యక్తులతో సాగిన భూ కబ్జాల పర్వంపై కీసర పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదవుతున్నాయి. రోజుకో ముఠా వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ఈ అక్రమ దందా వెనుక అప్పటి సబ్‌రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా నిలిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. అతడిపై చర్యలకు ప్రభుత్వానికి పోలీసులు లేఖ రాసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. సూత్రధారులను పట్టుకుంటే ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఆయా రిజిస్ట్రేషన్ల డేటాను విశ్లేషించి పూర్తిస్థాయిలో బాధితులకు న్యాయం చేసేందుకు అవకాశముంటుందని ప్రజలు సూచిస్తున్నారు.
ఇటీవల కీసర పోలీసులు గుంజి చిరంజీవి మరో ముఠాను అరెస్ట్ చేశారు. తాజా కేసుతో ఇంకా నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి, అమాయకులను మోసం చేసే ముఠాలు ఉన్నాయని బయటపడుతుంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కీసర ఠాణా పరిధిలోనే ఇలాంటి ఘటనలు జరిగినట్లు బయటపడుతుంది. ఒక్కో కేసులో కొత్త ముఠా వ్యవహారం బయటకు వస్తుంది. అసలు ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్లాట్లకు నకిలీపత్రాలు తయారయ్యాయి, అందులో నకిలీ వ్యక్తులను ముందు పెట్టి ఎంత మందికి క్రయ విక్రయాలు చేశారు. అనే విషయాలను నిగ్గు తేల్చాల్సిన పోలీసులు, ఈ విషయంపై తాత్సారం చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఆ విషయాలను ఎక్కడికక్కడే వదిలేశారనే ఆరోపణలు సైతం విన్పిస్తున్నాయి. కొందరు బాధితులు ఇతర దేశాల్లో ఉండడం, వృద్ధులు కావడం వివిధ కారణాలతో అసలు యజమానులకు తమ ప్లాట్లు వేరే వారిపై వెళ్లాయనే విషయం తెలియకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్ణీత కాలంలో జరిగిన వ్యవహారాలను పూర్తిస్థాయిలో ఆరా తీస్తే ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.