సిటీ బ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు భూకబ్జాలకు తెగబడుతున్నారు. సిటీలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆక్రమించేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం అండ చూసుకుని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో బరితెగిస్తున్నారని మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ పరిధి రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ వినాయక నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అనుచరుడు రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి భవనం నిర్మిస్తున్నారని బోరబండ పోలీస్ స్టేషన్, యూసుఫ్‌గూడ సర్కిల్-19 డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశామని చెబుతున్నారు.
కబ్జా చేసింది అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. కార్పొరేటర్ అనుచరుడు భవనం నిర్మిస్తున్న 80 గజాల స్థలంలో గతంలో వాటర్ ట్యాంక్ ఉండేదని స్థానికులు తెలిపారు. ఇటీవల ట్యాంక్ శిథిలమవడంతో బల్దియా అధికారులు దాన్ని తొలగించారు. దీంతో అక్కడ ఖాళీ స్థలం ఏర్పడటంతో కార్పొరేటర్ అనుచరుడు దానిపై కన్నేసి అక్రమ నిర్మాణం చేపట్టారని చెబుతున్నారు. అక్కడ భవనం నిర్మిస్తే తమ రాకపోకలకు అడ్డుగా ఉంటుందని వాపోతున్నారు.
ఆక్రమణదారుడు భవన నిర్మాణాన్ని నిలిపేయాలని జీహెచ్ఎంసీ రివోకేషన్ లెటర్ పంపింది. యాజమాన్య పత్రాలు, లింక్ డాక్యుమెంట్లను సమర్పించని కారణంగా టీజీబీపాస్ యాక్ట్-2020 కింద అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ అక్రమంగా నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆవేమీ పట్టించుకుకోని ఆక్రమదారుడు నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారుల నుంచి నిర్మాణం చేపట్టవద్దని నోటీసు అందినా కొనసాగించడం వెనుక ఉన్న మతలబేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. బల్దియా అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.