సిటీబ్యూరో: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు లేవు. ఇదే హెచ్ఎండీఏ పరిధిలో పాలన పడకేసేలా చేస్తోంది. ఉన్నతాధికారులే విధులకు దూరంగా ఉండటంతో.. సిబ్బంది పనితీరు సాధారణ జనాలను ముప్పు తిప్పులు పెడుతున్నది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో కొన్ని విభాగాల్లో ఆలసత్వం ఖజానాకు గండి కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇక ఆదాయ వనరులను పెంచడంలోనూ కొన్ని విభాగాల ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో హెచ్ఎండీఏలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్ ఇచ్చినా.. పనితీరులో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణాల అనుమతులను వేగంగా చేస్తున్నామని చెబుతున్నా.. ఆన్లైన్ సమస్యల కారణంగా కార్యాలయానికి వచ్చిపోయే జనాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అనుమతులతో ఆదాయం సమకూరుతుందని తెలిసినా.. నెలకొన్న జాప్యం అటు దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. అలాగే కొత్వాల్‌గూడ ఏకో పార్క్ నిర్మాణ పనులు నెమ్మదించాయి.
ఇటీవల కాలంలో భవన నిర్మాణ అనుమతుల విషయంలో షాడో నేతల ప్రమేయంలోనూ కొంత మంది అధికారుల ప్రోత్సాహం ఉందనే విమర్శలు ఉన్నాయి. కనీసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ఉన్నతాధికారులు సమీక్షించడం లేదని తేలింది. ఈ క్రమంలో బుద్ధపౌర్ణమి ప్రాజెక్టులో పార్కింగ్ కాంట్రాక్టుల అవకతవకలకు కారణమైందని తెలిసింది.
అదే తరహాలో అర్బన్ ఫారెస్ట్రీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారినట్లుగా తెలుస్తోంది. టెండర్ల ఖరారు నుంచి పనులు అప్పగించేంత వరకు కొందరు ఉన్నతాధికారుల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిదే ట్యాంక్ బండ్ పరిసరాల్లో జరిగిన పార్కింగ్ అవకతవకలకు తెరతీసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై వచ్చిన ఆరోపణలతో పార్కింగ్ కాంట్రాక్ట్‌ను చక్కదిద్దినా… ఇలాంటివేన్నో వ్యవహారాల్లో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలిసింది. వీటిపై సహోద్యోగులే బాహాటంగానే ఆరోపణలు చేస్తుండగా.. ఇక డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల పెత్తనం విస్తరించినట్లు ఉద్యోగులు వాపోతున్నారు.