సిటీబ్యూరో/బన్సీలాల్పేట, మార్చి 24,(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అమ్మాయిలు, మహిళలకు భద్రత కల్పించకుండా అందాల పోటీలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నానికి గురై, రైలు నుంచి దూకి గాంధీలో చికిత్స పొందుతున్న బాధిత యువతిని సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తో కలిసి పరామర్శించారు.
మెరుగైన సేవలందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారికి సూచించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అనే విషయాన్ని ఈ సంఘటన తెలియజేసిందని వాపోయారు. ఇటీవల పోలీసు శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత 15 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో 22 శాతం క్రైమ్ రేటు పెరిగినట్లు అందులో ప్రకటించారని ఆమె గుర్తుచేశారు.
రైలు, బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించవచ్చనే ఆలోచన మహిళల్లో ఉంటుందని, కానీ ఇటీవల బస్సులో డ్రైవర్లు ప్రయాణికులపై దాడి చేయడం, ప్రస్తుతం రైల్లో కూడా అత్యాచారయత్న సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటే, రాష్ట్రంలో మహిళల భద్రతపై భయం వేస్తుందని ఆవేదన చెందారు. మహిళల కోసం కేటాయించిన రైలు భోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తాము రైల్వే పోలీసులను కోరుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తల్లిదండ్రులు తమ పిల్లల బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటారని, ప్రస్తుతం క్షణక్షణం తల్లిదండ్రులు భయపడుతున్నారని వాపోయారు.
అందాల పోటీలు నిర్వహించడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని మహిళల భద్రతకు ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ బాధితురాలి దవడ, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని, ఆమెకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విచారణ వేగవంతం చేశాం.. రైల్వే ఎస్పీ చందనాదీప్తి
నిందితుడిని పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేశాం. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటాం. రైలులో ప్రయాణించే మహిళలు తమ స్మార్ట్ ఫోన్లో షీటీం సూచించిన పలు యాప్లు డౌన్లోడ్ చేసిపెట్టుకోవాలి. ఏదైనా ప్రమాదం ఉందని గుర్తిస్తే.. దానిలో సమాచారం అందిస్తే వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులు 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు’ రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు.
నిలకడగా ఉంది: డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్
బాధితురాలిని శనివారం రాత్రి అత్యవసర విభాగానికి తరలించగానే చికిత్స ప్రారంభించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. డెంటల్, న్యూరో, గైనకాలజీ వైద్యులు ఆమెను పరీక్షిస్తున్నారు’ అని గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు సోమవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రి నుంచి యశోద హాస్సిటల్కు తరలించి, చికిత్సనందిస్తున్నారు.