సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో క్షణం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో ఎస్పీడీసీఎల్ పటిష్టమైన చర్యలు తీసుకుని టీజీ ట్రాన్స్‌కో సమన్వయంతో సబ్స్టేషన్ల నిర్వహణ, ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తూ విద్యుత్ సమస్యలు లేకుండా మెరుగైన సేవలు అందించారు. కట్ చేస్తే..! గత రెండేళ్లుగా నగరంలో ఎప్పుడు కరెంట్ పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. కొత్తగా నిర్మాణమైన సబ్స్టేషన్లు తక్కువే. లోడ్‌ను భరించగలిగే సామర్థ్యం ఉన్నా నిర్వహణలోపంతో అడుగడుగునా విద్యుత్ అంతరాయాలతో గ్రేటర్ అంధకారమయమవుతోంది. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన 220కేవీ సబ్‌స్టేషన్‌లో అంతరాయం నేపథ్యంలో సుమారు పది గంటల పాటు సరఫరా నిలిచిపోవడం ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తున్నది. గ్రేటర్లో రెండేళ్లుగా ఎప్పుడు కరెంట్ పోతుందో వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలో.. అంతకుము ందు మియాపూర్‌లో .. గత నెలలో శివరాంపల్లిలో 220 కేవీ సబ్స్టేషన్లలో సమస్యలు తలెత్తి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సబ్స్టేషన్ల నిర్వహణ ట్రాన్స్‌కో పరిధిలో ఉంటుంది. అయితే ఆరేడు గంటల పాటు కరెంట్ పోవడానికి ట్రాన్స్‌కో నిర్వహణ లోపాలే కారణమని టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది అంటున్నారు. గచ్చిబౌలిలో జంపర్ కట్ వ్యవహారంలో ట్రాన్స్ కో పరంగా పలు ఆపరేషన్ లోపాలు బయటపడ్డాయి. నగరంలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు పనిచేస్తున్నాయి. నగరంలో విద్యుత్ సరఫరాకు ఇవి అత్యంత కీలకం కాగా ఇవి 24 గంటలూ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మరమ్మత్తులు చేసేందుకు సిబ్బంది, అధికారులు సిద్దంగా ఉండాలి. కానీ గచ్చిబౌలిలో జంపర్కంట్ అయితే మరమ్మత్తులకు ఆరుగంటల సమయం పట్టింది. వేసవిలో అధిక లోడ్లు ఉన్న సమయంలో, విపత్తుల సమయంలో నిర్వహణకు సంబంధించి స్టాండర్ ఆప్ ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అవేవీ అమలు కాలేదు. సిబ్బంది సైతం పరిమితంగా ఉన్నారు. షెడ్యూల్ మెయింటెనెన్స్ లోపాలు బయటపడ్డాయి. ఇన్కమింగ్ బస్బార్లో క్రాంప్ కరిగిపోయి జంపర్ కట్ అయింది. ఇది పూర్తిగా నిర్వహణ లోపం క్రిందకే వస్తుంది. లోడ్‌కు తగ్గటుట్గా కొత్తవాటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, రాయదుర్గం ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు ఓవర్‌లోడ్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తాము అవసరమైన చోట 33/11కేవీ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నా పై నుంచి సరఫరా లేకపోతే ప్రయోజనం లేదని అధికారులు చెప్పారు.
నగరంలో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను టీజీఎస్పీడీసీఎల్ నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తుంది. పెరుగుతున్న లోడ్‌కు తగ్గట్టుగా సామర్థ్యం పెంపు విషయంలో ట్రాన్స్‌కో అభివృద్ధి పనులు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. గచ్చిబౌలి 220 కేవీలో ఇన్కమింగ్ నిలిచిపోవడంతో అక్కడే ఉన్న 132 కేవీకి సరఫరా ఆగిపోయింది. వీటి పరిధిలోని గచ్చిబౌలి, ట్రిపుల్ఐటీ, పాపిరెడ్డికాలనీ, చందానగర్, ఎల్అండ్టీ 33/11కేవీ రెండు గచ్చిబౌలి 220/132 కేవీ సబ్‌స్టేషన్ నుంచే ఉండడంతో ప్రత్యామ్నాయం సాధ్యపడలేదని డిస్కం ఇంజనీర్లు చెప్పారు సబ్స్టేషన్ల నిర్మాణాలను ట్రాన్స్‌కో పట్టించుకోకపోవడంతో లోడ్‌పెరిగి విద్యుత్ సరఫరాలో నిరంతరం అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ట్రాన్స్‌కో-టీజీఎస్పీడీసీఎల్ మధ్య అవగాహనలోపంలో సబ్స్టేషన్లు ఓవర్‌లోడ్‌కు గురై సాంకేతిక సమస్యలు పెరుగుతున్నాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎవరికివారే అన్న చందంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నగరం అంధకారమవుతోంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గచ్చిబౌలిలో జరిగిన జంపర్ లోపాన్ని సరిదిద్దడంలో సిబ్బంది పడిన ఇబ్బందులు చూస్తుంటే చిన్నచిన్న లోపాలు సరిదిద్దడానికే సిబ్బంది సతమతమవుతున్నారంటే నిర్వహణ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకవైపు ట్రాన్స్‌కో సబ్స్టేషన్లలో లోపాలు వెంటవెంటనే సరిదిద్ది సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని డిస్కం సిబ్బంది చెబుతుంటే ట్రాన్స్‌కో మాత్రం తమ దగ్గరి సిబ్బంది తక్కువగా ఉన్నారని సాధ్యమైనంతమేర సరఫరాను కొనసాగిస్తున్నామని, అయితే ప్రత్యామ్నాయంగా వాడాల్సిన స్టేషన్ల విషయంలో డిస్కం సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ చెప్తున్నారు. ఈ రెండు సంస్థలు ఒకరంటే ఒకరనుకోవడం మాటేమో కానీ సరఫరాలో లోపాలతో వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
టీఎస్ ట్రాన్స్‌కో గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రింగ్‌మెయిన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌తో గ్రేటర్ చుట్టుపక్కల 220కేవీ సబ్స్టేషన్ల నిర్వహణతో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూశారు. ఒక్క గ్రేటర్‌లోనే 400కేవీ సబ్స్టేషన్లు 5, 220కేవీ సబ్స్టేషన్లు 21, 132 కేవీ సబ్స్టేషన్లు 34, 33/11కేవీ సబ్స్టేషన్లు 465 ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడా సైప్లెలో అంతరాయం లేకుండా చూశారు. శంకరంపల్లి, రాయదుర్గ, ఉస్మానియాయూనివర్సిటీ, బంజారాహిల్స్‌తో పాటు శివరాంపల్లి, మామిడిపల్లి, మాల్కారం వంటి చోట్ల ఇంటర్‌లింకింగ్ స్టేషన్లతో 220కేవీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేశారు. రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్ తదితర చోట్ల కొత్తగా అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఐటీ, అనుబంధ కంపెనీలు, హక్షటళ్లు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్తలు వెలిశాయి. ఈ నేపథ్యంలో వీటికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన సబ్స్టేషన్లు ఏర్పాటుచేసింది. రాయదుర్గంలో దేశంలోనే తొలిసారిగా గ్యాస్ ఇన్సులేటెడ్ ఆధారిత సబ్స్టేషన్లను నిర్మించారు. శంకర్‌పల్లిలో 400/220కేవీ నిర్వహణతో గచ్చిబౌలి, షాద్‌నగర్, తాండూరుకు , రాయదుర్గలో 400/220/132కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌తో ఐటీ మరియు వాణిజ్యపరమైన ప్రాంతాలకు విద్యుత్‌సరఫరా నిరంతరాయంగా జరిగేలా ఏర్పాటు చేశారు. ఉస్మానియాలో 220కేవీతో అంబర్‌పేట, సికింద్రాబాద్, బంజారాహిల్స్‌లో 220కేవీతో పశ్చిమ, సెంట్రల్ గ్రిడ్లకు సరఫరాలో లోపాలు లేకుండా ఏర్పాటు చేశారు. దీంతో రాబోయే ఐదేళ్ల వరకు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసినా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గరినుంచి ఈ సబ్స్టేషన్ల నిర్వహణలో లోపం కారణంగా మొదటికే మోసం జరుగుతోంది.