H-CITI | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): హెచ్ సిటీ ( హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్టక్చ్రర్) ప్రాజెక్టు ఆ మూడు శాఖల్లో మంట పుట్టిస్తున్నది. ఎస్సార్డీపీ స్థానంలో సిగ్నళ్లు లేని జంక్షన్లే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి హెచ్ సిటీ ప్రాజెక్టును తీసుకువచ్చి రూ.2,373 కోట్ల పనులకు టెండర్లు పిలవాలని సర్కారు జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అన్ని చోట్ల పనులకు టెండర్లకు సిద్ధమైన దరిమిలా.., కొత్త పంచాయతీ మెట్రో, టీజీఐఐసీ రూపంలో కొత్త పంచాయతీ వచ్చి పడింది. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం లోపం కారణంగా హెచ్ సిటీ ప్రాజెక్టు టెండర్లలో మరింత ఆలస్యం కావడమే కాదు, టీజీఐఐసీ డిమాండ్ మేరకు ఒక చోట నుంచి జీహెచ్ఎంసీ తప్పుకోవడం ఇంజనీర్లలో ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు వచ్చే ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల పనులకు రూ.837 కోట్ల పరిపాలన అనుమతులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిజైన్లను ఖరారు చేసి టెండర్లను సిద్ధం చేసింది. రూ.158 కోట్లతో 1.05 కిలో మీటర్ల మేరలో విప్రో సర్కిల్ దగ్గర రెండు మార్గాల్లో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. విప్రో గేట్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ ఎస్సెంచర్కు ముందుగా దిగనుంది. ఇదే మార్గంలో మెట్రో రైల్ రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియో పోలీస్ వెళ్లే మార్గం రానుంది.
అందుకు అనుగుణంగా ఫ్లై ఓవర్, పై నుంచి మెట్రో వెళ్లేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఐతే, మెట్రో నిర్మాణం మెట్రో, ఫ్లై ఓవర్ వంతెన మాత్రం జీహెచ్ఎంసీ చేపట్టాల్పి ఉంది. కానీ, ఇక్కడే టీజీఐఐసీ మా పరిధిలో ఉంది.. కాబట్టి మేం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపడతామంటూ జీహెచ్ఎంసీకి అడ్డు తగిలింది. మెట్రో భవన్లో ఈ మూడు శాఖల మధ్య సమావేశంలో టీజీఐఐసీ శుక్రవారం తేల్చి చెప్పింది. దీంతో జీహెచ్ఎంసీ వెనక్కి తగ్గి విప్రో సర్కిల్ వంతెన పనుల నుంచి తప్పుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
ఐతే, డిజైన్లతో సిద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్టు పనులను ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటని టీజీఐఐసీ తీరు పట్ల జీహెచ్ఎంసీలో కొందరు ఇంజనీర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మొత్తంగా శాఖల మధ్య సమన్వయంతో హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ.220 కోట్లతో 1.52 కిలోమీటర్ల మేరలో ఖాజాగూడ చౌరస్తాలో పై వంతెన, అండర్ పాస్, రూ.459 కోట్లతో 3.25 కోట్లతో త్రిపుట్ ఐటీ జంక్షన్లో మూడు వంతెనలు, అండర్ పాస్ పనులకు టెండర్లను పిలిచేందుకు జీహెచ్ఎంసీ సిద్ధం అవుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు.