చర్లపల్లి, జూలై 18: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం సంక్షేమ సంఘం, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులకు సైబర్ నేరాలపై శుక్రవారం నాడు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు జరిగిన వెంటనే సైబర్ క్రైమ్‌కు సమాచారం అందిస్తే.. ఆ ఖాతాను ప్రీజ్ చేయడంతో పాటు తగిన విచారణ జరిపించి నిందితుల వివరాలను సేకరిస్తామని తెలిపారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేరాల నియంత్రణ, శాంతియుత సమాజానికి కాలనీవాసులు సహకరించాలని కోరారు.