కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 18 : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను చించడం బాధాకరమని అన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై సోయిలేని కాంగ్రెస్ సర్కార్, జీహెచ్ఎంసీ అధికారులతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్లెక్సీలను తొలగించడం సరికాదని మండిపడ్డారు.
కేసీఆర్ తో పాటు తన జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వేడుకలకు ముందురోజే ఎలా తొలగిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. గత ఏడాదికాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే పట్టించుకోని అధికారులు.. నేడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను కక్షపూరితంగా తొలగిస్తుందని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఒకే నిబంధనలు ఉండాలని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతల ఫెక్సీలను కూడా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు సూచించారు.
అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకడం మానుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓ న్యాయం.. అధికార పార్టీకి ఒక న్యాయం ఉందని… ఏదైనా ఒకే నిబంధనను అమలు చేస్తే మంచిదని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కొందరు దౌర్జన్యాలు చేస్తున్నారని.. భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని, చిల్లర పనులు చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. భవిష్యత్తులో ఆ ప్రజలే మంచి కోసం నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.