MLA Madhavaram Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 29: వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సూపర్ సక్సెస్ కావడంతో.. కాంగ్రెస్ పార్టీ నేతల్లో వణుకు మొదలైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారని తెలిపారు. దేశ చరిత్రలోనే వరంగల్ బీఆర్ఎస్ సభ లాంటి సభ జరగలేదని తెలిపారు.
కేసీఆర్ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక.. కాంగ్రెస్ మంత్రులు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి జనాలు రాలేదని, బాహుబలి సెట్టింగ్ అని చెప్పడం సిగ్గుచేటు అని కృష్ణారావు విమర్శించారు. సిగ్గు, శరం ఉంటే సభకు ప్రజలు వచ్చారో లేదో.. వరంగల్లోని మీ కాంగ్రెస్ పార్టీ నేతలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎన్ని లక్షల మంది వచ్చారో మీ కాంగ్రెస్ నేతలే మీకు చెబుతారని అన్నారు. అధికారం కోసం 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను మోసం చేసిందని, 20 హామీలను కూడా నెరవేర్చలేని మీరు కేసీఆర్ విమర్శిస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే ప్రజలు విరక్తి చెందారని.. భవిష్యత్తులో ఆ పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని అబద్ధాలు ఆడినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: ఎమ్మెల్యే కృష్ణారావు
అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో సాయపడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని బోయిన్పల్లి డివిజన్ చెందిన సంబు రవీందర్ కు ఒక లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. అలాగే, డబ్ల్యూపీసీ స్టేట్ ఓపెన్ చాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ తెలంగాణ పోటీల్లో సత్తా చాటిన రవికుమార్, అఖిల్, స్నేహ, ఎం.రాజు లను ఎమ్మెల్యే కృష్ణారావు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.