కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 18 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన ప్రతిసారీ హౌసింగ్ బోర్డు ఆస్తులకు గండం వస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. గతంలో వందల ఎకరాలను అమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు హౌసింగ్ బోర్డు భూములకు ఎసరు పెట్టిందని చెప్పారు. కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజల సొత్తును అమ్ముకుంటే ఊరుకునేది లేదని, హౌసింగ్ బోర్డు స్థలాల వేలాన్ని విరమించుకోకుంటే… ప్రజలతో కలిసి అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లో వేలానికి పెట్టిన హౌసింగ్‌బోర్డు స్థలాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలంలో ఏర్పడిన హౌసింగ్‌బోర్డు కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్థలాలను అమ్ముకోవడం అలవాటుగా మారిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వందలాది ఎకరాలు అమ్మారని, నేడు కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని పలు ఫేజ్‌లలో 73 ఆస్తులను అమ్మడానికి నోటిఫికేషన్ విడుదల చేశారని, అంతేకాకుండా కాలనీలో ప్రజల అవసరాల కోసం వదిలిన 10 శాతం ఓపెన్ ల్యాండ్‌ను(ప్రజల సొత్తును) సైతం అమ్మకానికి పెట్టడం బాధాకరమన్నారు. కేవలం 6 గజాలే ఉన్న అతి చిన్న స్థలానికి కూడా గజానికి 1.25 లక్షల చొప్పున ధర నిర్ణయించి వేలానికి పెట్టడం మరీ అన్యాయమని విమర్శించారు.
మేము కాపాడితే.. మీరు అమ్ముతారా..?
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గజం స్థలం కూడా అమ్మలేదని, ఆయా ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కోర్టుల్లో కొట్లాడి కాపాడుకున్నామని కృష్ణారావు చెప్పారు. తాము కాపాడిన స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేపీహెచ్‌బీ కాలనీ 1,2వ ఫేజ్‌లో మూడెకరాల స్థలాన్ని కోర్టు ద్వారా దక్కించుకుని పార్కుగా అభివృద్థి చేశామని, 3వ ఫేజ్‌లో 3 ఎకరాల స్థలంలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక పార్కుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అదేవిధంగా పోచమ్మదేవాలయం కోసం 500 గజాల స్థలం, భగత్‌సింగ్ కాలనీలో దేవాలయం కోసం స్థలాన్ని కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కాలనీ 9వ ఫేజ్‌లో 2.34 ఎకరాల స్థలాన్ని పార్కుకోసం కేటాయించి హెచ్ఎండీఏతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నెక్సెస్ మాల్ ప్రక్కన 24 ఎకరాల స్థలాన్ని సుప్రీంకోర్టులో కొట్లాడి హౌసింగ్‌బోర్డుకు చెందేలా కృషి చేసినట్లు తెలిపారు. కాగా… కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వందల ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుందని, తిరిగి ఇప్పుడు.. ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాలను విక్రయానికి పెట్టిందని విమర్శించారు.
ఈ నెల 24న వేలంపాటను అడ్డుకుంటాం..
కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేయడం మానుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎవరైన కొనుగోలు చేస్తే… ఆ స్థలాలలో నిర్మాణాలు చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కేపీహెచ్‌బీ కాలనీలో గజాలలో ఉన్న స్థలాలను విక్రయానికి పెట్టడం దేనికని, ప్రభుత్వ ఏమైనా అడుక్కుతింటుందా? అని ప్రశ్నించారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ప్రభుత్వ పాఠశాల స్థలం, చర్చి స్థలాలు, ప్రజలు కోసం వదిలిన స్థలాలలో బోర్డులు పెట్టి అమ్మకానికి పెట్టారని తెలిపారు. సాయినగర్ కాలనీలో బీఆర్ఎస్ హయాంలో గజానికి రూ.27వేలు చెల్లించాలని కోరితే.. నేడు రూ.1.25లక్షల ధర నిర్ణయించడం, అల్పదాయ వర్గాల ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేలా పనిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజల అస్తులను అమ్ముకునే వేలంపాటను ప్రభుత్వం, అధికారులు ఆపాలన్నారు. లేనిపక్షంలో ప్రజల ఆస్తులను కాపాడేందుకు ఈనెల 24న జరిగే వేలాన్ని అడ్డుకుంటానని హెచ్చరించారు.