MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 8 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి… పేదలకు అందించిన సంక్షేమ పథకాలను… ప్రజలకు వివరిస్తూ.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ విధంగా మోసం జరుగుతుందో వివరించాలని కోరారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో పార్కులు, స్మశాన వాటికలు, రోడ్లను అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేసి బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మార్చాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు ఉన్నారు.