బాలానగర్, జూలై 29: అభివృద్ధి కోసం నిధులు కేటాయించినా పనులు చేయడంలో అలసత్వం ఎందుకని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రధానంగా నాలాలు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం గతంలో రూ.103 కోట్ల నిధులు కేటాయించినా పనులు చేపట్టక పోవడంలో అంతర్యం ఏమిటని అధికారుల తీరుపై ఆయన మండి పడ్డారు.
రామారావునగర్ నాలా అభివృద్ధి, భరత్‌నగర్ వద్ద నాలా నిర్మాణంలో భాగంగా మైసమ్మ చెరువు నుంచి పనులు చేపట్టకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఫతేనగర్ డివిజన్ దీన్‌దయాల్‌నగర్, జింకలవాడ నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, కేపీహెచ్‌బీ డివిజన్ కల్వరి టెంపుల్ వద్ద పైప్‌లైన్ నిర్మాణం, డ్రైనేజీ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించినా పనులు చేపట్టకపోవడంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.
కేపీహెచ్బీలో పెరుగుతున్న హాస్టల్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యస్తంగా తయారైందని, కేపీహెచ్‌బీకాలనీలో 1800 హాస్టల్స్ ఎలాంటి అనుతులు లేకుండా ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని తెలిపారు. పనిచేయని కంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి, డివిజన్లో అధికారులు ఏదైనా పని చేపడితే కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వడంలేదు, వారిని ఎందుకు గౌరవించడం లేదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో అన్యాయం జరుగుతుందన్నారు.
ఇందిరానగర్, శ్రీశ్రీనగర్లలో డ్రైనేజీ, రోడ్లు వేయండి
బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీనగర్, ఇందిరానగర్లలో డ్రైనేజీ, రోడ్లు సకాలంలో చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. అన్ని బస్తీల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేశామని గురు ్తచేశారు. అనాడు పనులు చేపట్టి నిర్ధేశిత సమయంలో పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు పనులు పూర్తి అయినందున ప్రస్తుతం అంత ఇబ్బందులు కలుగడంలేదన్నారు.
నియోజకవర్గం పరిధి డ్రైనేజీ, రోడ్లు, నాలాల విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కొత్తగా మంజూరైన పనులకు టెండర్లు త్వరగా పూర్తి చేసి తదుపరి సమీక్ష సమావేశానికి సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి బోయిన్ చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో దోమల బెడద ఎక్కువైందన్నారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తక్షణమే తొలగించాలని సూచించారు. పెండింగ్‌లో చెరువుకట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
వర్షాకాలం సందర్భంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు, వేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నర్సింహ యాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, సబిహబేగం, మందడి శ్రీనివాస్‌రావు, పగుడా శిరీషబాబురావు, మేడ్చల్ జిల్లా మైనార్టీ నాయకులు ఎండీ గౌసుద్ధీన్, మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రావణ్‌కుమార్, ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.