అబిడ్స్ మే 26: రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమూద్ అలీని.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ అబిడ్స్ చాపల్ రోడ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహమూద్ అలీని సోమవారం కేటీఆర్ పరామర్శించారు. వైద్యులతో మహమూద్ అలీ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీ, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంకే బద్రుద్దీన్, మహిళా నాయకురాలు ప్రియా గుప్తా, జాంబాగ్ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అహ్మద్, నాయకులు.. ప్రదీప్, టంపు, శైలేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మీరే రావాలి సార్..
చాపల్ రోడ్‌లోని దవాఖానాలో చికిత్స పొందుతున్న మహమూద్ అలీని పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్ పట్ల ప్రజలు విశేష ఆదరణ కనబరిచారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులను ఆత్మీయంగా పలకరించగా.. కేటీఆర్ సార్ మళ్లీ మీరే రావాలి అని తమ అభిమానాన్ని చాటుకున్నారు.బీఆర్ఎస్ హయాంలోనే తాము సంతోషంగా ఉండేవారమని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం మరించిందని తెలిపారు. అదేవిధంగా ఓ మహిళ దవాఖానలో తనకు అయిన బిల్లును తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భరించలేనని చెప్పగా యాజమాన్యంతో మాట్లాడి బిల్లు తగ్గించేలా చూస్తానని కేటీఆర్ ఆమెకు హామీ ఇచ్చారు.