KTR | నగర పరిధిలోని బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆతిథ్యం స్వీకరించారు. ఈ నెల 2న నూతన సంవత్సరం సందర్భంగా ఇబ్రహీం కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని, దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. ఈ ఐదేళ్లకాలం సినిమాలో ఇంటర్వెల్ మాదిరిగా గడిచిపోతుందన్న ఇబ్రహీం.. రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానించారు.
ఇబ్రహీం బోరబండలో గాజుల దుకాణం నిర్వహిస్తూ ఉంటాడు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. విందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆదివారం ఇబ్రహీం ఇంటికి వెళ్లగా.. కుటుంబీకులు సాదర స్వాగతం పలికారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే.. స్పందించి పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇబ్రహీం కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్.. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం పిల్లలకు చెవుడుతో బాధపడుతుండగా.. వారికి అవసరమైన చికిత్సకు ఖర్చులు అందించేందుకు ముందుకు వచ్చారు. ఓ సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయన్నారు.