8వ తేదీన షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్ డివిజన్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే 9వ తేదీ ప్రచార చివరి రోజున షేక్‌పేట నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచార కార్యక్రమాన్ని ముగించనున్నారు.
సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ దూకుడు పెంచుతున్నది. ఒక వైపు చేరికలు, మరో వైపు ప్రచారంలో అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ దూసుకుపోతున్నది. మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్‌ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం నుంచి వచ్చే నెల 9వరకు రోడ్ షో, బైక్ ర్యాలీల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. గ్రేటర్ రాజకీయాలపై చెరగని ముద్ర వేసుకున్న కేటీఆర్ ఎన్నికల సమరంలో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగుతుండడంతో ప్రచారం మరింత హీటెక్కడంతో పాటు అధికార పార్టీకి ముచ్చెమటలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రచారానికి జనం బ్రహ్మరథం…
ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు అడగడుగునా పూలవర్షంతో సాదర స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఒక వైపు సమావేశాలు మరోవైపు చేరికలతో పార్టీలో జోష్ కనిపిస్తున్నది. డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు. 22 నెలలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అంటూ ప్రచారాన్ని హీటెక్కించారు. ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థి అభ్యర్థులకు వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు.
దూసుకువస్తున్న తారక మంత్రం..
గ్రేటర్ రాజకీయాలపై కేటీఆర్‌ది చెరగని ముద్ర..! ఎన్నికలు ఏదైనా ఆయన మ్యాజిక్ ఫలించాల్సిందే..! తారక మంత్రం పారాల్సిందే..! ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ యువనేతగా ముందుకు కదలడం..నగర పార్టీ కార్యకలాపాల్లో అన్నీ తానై వ్యవహరిస్తూ అందరిని కలుపుకుపోతూ క్యాడర్లో ధైర్యాన్ని నూరిపోయడం..నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇవ్వడం, గ్రేటర్లో తలపండిన రాజకీయ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాల కలిగిన నేతగా ఆయన గుర్తింపు సాధించారు. మోడ్రన్ లీడర్‌గా పేరు తెచ్చుకుని కేటీఆర్ తన వాగ్దాటితో అనతికాలంలోనే విశ్వనగర విజన్ నేతగా అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. పార్టీని కానీ తనను కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే తనదైన శైలిలో పంచ్‌లు వేసి దిమ్మ తిరిగేలా చేస్తారు.
చమత్కారాలతో నవ్వులు పూయిస్తారు. సాటి మనిషికి సాయపడి ఎందరి హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. మోడ్రన్ లీడరే కాదు పురపాలక శాఖ మంత్రిగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలోను తనదైన మార్కును ప్రదర్శించారు. ప్రస్తుతం 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలపై గళం విప్పుతూ సీఎం రేవంత్‌రెడ్డి అక్రమాలు, కుటుంబీకుల అడ్డగోలు దందాలపై ప్రశ్నిస్తూ జనం మన్ననలు పొందారు. గతంలో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 స్థానాలు, 2018 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు గాను 14 స్థానాల్లో విజయదుందుభి మోగించడంలో అన్నీ తానై నడిపించిన యువనేతగా కేటీఆర్ కింగ్‌మేకర్ అయ్యారు. 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బల్దియా పీఠంపై గులాబీ జెండాను ఎగరవేయడంలో తనదైన మార్కు ప్రదర్శన కనిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా కేటీఆర్ ప్రచార రంగంలోకి దిగుతున్నారు.

[