సిటీబ్యూరో, నవంబర్ 9(నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ పతనం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గెలిచిన 64మంది ఎమ్మెల్యేలకే దిక్కులేదు.. కొత్తగా జూబ్లీహిల్స్‌లో ఏదో చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలు నమ్మొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ ఉప ఎన్నికలో గట్టిగా బుద్ధి చెప్పాలని మైనారిటీలకు పిలుపునిచ్చారు. నోట్లు కాకుండా మంచి పాలన అందించేవారిని ఎన్నుకోవాలని ఓటర్ల్లకు ఆయన సూచించారు.
రేవంత్‌రెడ్డి అంటే ఆర్ఎస్ఎస్ అని అభివర్ణించిన అసదుద్దీన్ కాంగ్రెస్‌కు ఎలా మద్దతిస్తున్నారని నిలదీశారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నదని ఒక్కో ప్రాంతంలో రూ.4వేల నుంచి రూ.6వేలు పంచుతూ ఓటుకు నోటు స్కీమును తీసుకొచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేసే గొప్ప అవకాశం 4లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలకు దక్కిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రచారంలో చివరి రోజైన ఆదివారం యూసుఫ్‌గూడలో రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

కేటీఆర్ రోడ్‌షోకు జూబ్లీహిల్స్ ప్రజలు వేలాదిగా కదిలివచ్చారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తమ పింఛన్లు పెంచుతామని మోసం చేసిన కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే రోడ్‌షోలో హైడ్రా అరాచకాలు, రైతన్నల ఇబ్బందులను ఓటర్లకు వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.
రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో స్వచ్ఛందంగా తరలివస్తూ అడుగడుగునా అపూర్వ ఆదరణ, అభిమానం చూపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అఖండ మెజారిటీతో గెలిపిస్తామని శపథం చేస్తున్నారు. ఆదివారం యూసుఫ్‌గూడలో కేటీఆర్ రోడ్ షోకు భారీగా తరలివచ్చి బీఆర్ఎస్కు అండగా ఉంటామని.. తమ ఓటుతో రేవంత్ సర్కారుకు గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టంచేశారు.
‘బతికుంటే బలుసాకైనా తిని బతుకొచ్చు’ అనే సామెత అచ్చం మన సీఎం రేవంతం సారుకు సరిపోతుందేమో. సీఎం సీటేమోగాని ఎక్కడికెళ్లినా జనాల నుంచి తీవ్ర ఆక్రోశాన్ని చవిచూస్తున్నాడు మరి. ఎందుకంటే ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా సరిగా అమలు చేయకపోవడమే. తులం బంగారం ఎక్కడ?, మా స్కూటీలు ఏవి?, మా రూ.2,500 ఎప్పుడిస్తరు? అని ఆదివారం యూసుఫ్‌గూడలో జరిగిన రోడ్‌షోలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ సీఎం అమలుకు సాధ్యం కానీ హామీలు కురిపించారు. అసలే రెండేండ్ల పాలనను సాగించలేక చేతులెత్తేసిన రేవంత్ సర్కారుపై జూబ్లీహిల్స్‌తో పాటు తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారు. రేపు నిర్వహించే ఉప ఎన్నికలో మూడో నంబర్ మీద ఉన్న కారు గుర్తుకు ఓటేసి రాష్ర్టానికి పట్టిన కాంగ్రెస్ దరిద్రాన్ని జూబ్లీహిల్స్ నుంచే తరిమేయడం షురూ చేయాలని వారు పిలుపునిచ్చారు.