KTR | కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం బాధరా అని ప్రశ్నించారు. నేను హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాష నేర్చుకో.. నువ్వు కూడా నేర్చుకో అని అన్నారు. నేను గుంటూరులో ఇంటర్ చదువుకున్నా.. నీ అల్లుడు ఆంధ్రోడే కదా అని ప్రశ్నించారు. ఇక చిట్టినాయుడు కాదు.. భీమవరం బుల్లోడు అని ఎద్దేవా చేశారు.
మా అయ్య మొగోడు.. తెలంగాణ తెచ్చిన మొనగాడు అని కేటీఆర్ అన్నారు. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు చెప్పుకోరు అని విమర్శించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి డీపీఆర్‌ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని తెలిపారు. 10 శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడిగారు.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి కోపమొస్తుందని అన్నారు.
ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని సోనియాగాంధీ మీద రేవంత్ రెడ్డి ఒట్టువేశాడని తెలిపారు. మహిళలకు రూ.2500 ఇస్తానని ప్రియాంక గాంధీ మీద ఒట్టు వేశాడని గుర్తుచేశారు. ఇవన్నీ ఎగవేసి.. ఇప్పుడు కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే బడ్జెట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.
బ్యాగులు మోసి జైలుకెళ్లి.. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఢిల్లీకి సంచులు మోసి పదవులు కాపాడుకుంటున్నాడని ఆరోపించారు. మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఎక్కడపోయాయని అడిగితే నీ గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా అంటున్నాడని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే నీ లాగుల తొండలు ఇడుస్తా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తిట్టాలనుకుంటే మూడు భాషల్లో పొల్లుపొల్లు తిడతానని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మొరుగుతున్నాడని అన్నారు. అమ్మ గీతమ్మ రేవంత్ రెడ్డిని కట్టేయ్.. లేదంటే ఎవరినన్న కరిచేలా ఉన్నాడని విమర్శించారు. కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేస్తున్నాడని తెలిపారు. జనవరి 1 నుంచి మహిళలకు రూ.2500 ఇస్తానని శపథం చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు.