మియాపూర్ , సెప్టెంబరు 24: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చట్టబద్ధంగా వారిపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం, ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో! చెప్పుకోలేని పరిస్థితిలో ఉండగా, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులది తలో మాటయ్యిందని, త్వరలోనే శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక రానుందని అఖండ మెజార్టీతో గెలవబోయేదీ బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పోరాటం, హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ భయపడి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటూనే సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తొమ్మిది నెలల్లోనే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేక నెలకొన్నదని కేటీఆర్ అన్నారు.
వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలో తగు గుణపాఠం చెబుతున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు త్వరలోనే కమిటీల నియామకం పూర్తి చేస్తామని, రాబోయే ఉప ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ను ఘన విజయంతో గెలిపించేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు తనతో పాటు సహచర ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావులు ఎల్లపుడూ అండగా, అందుబాటులో ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, కొమిరిశెట్టి సాయిబాబా, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.