సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, రెండేళ్ల్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. షేక్‌పేట డివిజన్ రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీలోవాసులతో పాటు వడ్డెర, హోటళ్ల అసోసియేషన్ సభ్యులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడ్డగోలు హామీలు, మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ సంపూర్ణ అభివృద్ధి సాధించిందని కేటీఆర్ గుర్తుచేశారు. నాడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అపార్ట్మెంట్లలో జనరేటర్లు, ఇన్వర్టర్ల అవసరం లేకుండా నిరంతర విద్యుత్ అందించగలిగాం. మత రాజకీయాలు లేకుండా అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేశామని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హయాంలో మైనార్టీల కోసం 204 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా సహాయం కింద ప్రత్యేకంగా రూ.20 లక్షల సాలర్షిప్ కూడా ఏర్పాటు చేశామని ఈ సంస్థల్లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని కేటీఆర్ వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆ తర్వాత మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. అదే తరహాలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచి అక్కడి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రోడ్లేస్తామని, పింఛన్లు పెంచుతామని, 24 గంటల నల్లా నీళ్లిస్తామని, రూ.1000 కోట్లు ఖర్చుచేసి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని చెప్పి ఇప్పుడు ఏమారుస్తున్నదని తూర్పారబట్టారు. తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని, కావాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు పక్కనున్న కంటోన్మెంట్ ప్రజలను అడిగి తెలుసుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో సైతం ఇదే పద్ధతిలో మోసం చేసేందుకు యత్నిస్తున్నదనే విషయాన్ని మరువద్దని సూచించారు. ఓటేస్తే మూడేళ్లు అరిగోస పడాల్సి వస్తుందన్నారు. పింఛన్లు పెంచకున్నా, ఉద్యోగాలివ్వకున్నా, తులం బంగారం ఇవ్వకున్నా మోసపూరిత మాటలు చెప్పినా తమకే ఓటేశారని అనుకొనే ప్రమాదం ఉన్నదని స్పష్టంచేశారు. అందుకే ప్రజలు ఆలోచించి తీర్పునివ్వాలని కోరారు. …మిగతా II లో
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని ఉద్ఘాటించారు. ఓఆర్ఆర్ లోపల ఏ ఒక్క సీటూ ఇవ్వకుండా నూటికి నూరు శాతం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని కొనియాడారు. కానీ పల్లె ప్రజలు హస్తం పార్టీ నేతల హామీలకు ఆశపడి ఓటేసిన పాపానికి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. నగర ప్రజలు తమను నమ్మలేదనే కోపంతో హైడ్రాను తెచ్చి ప్రతీకార రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. హైడ్రా పేరిట బుల్డోజర్లను తెచ్చి పేదల ఇళ్లను నేలమట్టం చేసి వారికి తీర ని దుఃఖాన్ని మిగిల్చిందని విమర్శించారు. హైడ్రా పెద్దోళ్లకు ఓ నిబంధనలు, పేదోళ్లకు వేరే నిబంధనలు పాటించడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.
మోకా ఇస్తే ఢోకా చేసిన అధికార పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు. ఇక్కడి ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంతటి ప్రాధాన్యత కలిగినందున ఓటర్లు సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘రౌడీషీటర్లను ఎన్నుకుంటారా? మీలో తలలో నాలుకలా మెదిలి కష్టాసుఖాల్లో పాలుపంచుకున్న గోపన్న సతీమణి సునీతమ్మను ఆదరిస్తారా? కారు కావాలా? బుల్డోజర్లు కావాలా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించండి..’ అని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. దోపిడీలకు తెరలేపి, హామీలను విస్మరించి మోసం చేసిన హస్తంపార్టీకి కర్రుకాల్చి వాతపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాగోపీనాథ్కు వడ్డెర సంఘాల బాధ్యులు, హోటల్స్ రెస్టారెంట్స్ అండ్ బేకర్స్ యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కారుకు ఓటేసి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రౌడీషీటర్లకు ఓటేయబోమని, మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, హోటల్స్ యూనియన్ గౌరవ, రాష్ట్ర అధ్యక్షులు మహేశ్‌యాదవ్, అనిల్ పాల్గొన్నారు. అలాగే పలువురు యూనియన్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా
ఆహ్వానించారు.