రంగారెడ్డి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్‌సిటీ ఏఐ గ్రాఫిక్స్‌కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధించిదేమీ లేదన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగుళూరు ఓఆర్ఆర్ సమీపంలో గల ప్రమీద గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫ్యూచర్‌సిటీ కోసం 330 ఫీట్ల వెడల్పుతో 41 కిలోమీటర్ల పొడవుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తున్నారని.. ఇందుకోసం జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని మండిపడ్డారు.
అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలనూ చట్టవిరుద్ధంగా తీసుకుంటున్నదన్నారు. ఫ్యూచర్‌సిటీ మొత్తం ఒక డ్రామా అని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొల్లగొట్టేందుకే ఫ్యూచర్‌సిటీని అడ్డం పెట్టుకున్నారని దుయ్యబట్టారు. అలాగే, మరో 16 వేల ఎకరాల భూముల నూ ఫ్యూచర్‌సిటీ పేరుతో సేకరించేందుకు యత్నిస్తున్నదన్నారు. జిల్లాలో విలువైన భూములను ముఖ్యమంత్రి తన అనుచరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని..
అందులో భాగంగానే నాదర్గుల్ గ్రామంలోని 613 సర్వేనంబర్‌లోని 7,000 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు, కొహెడ మార్కెట్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 172 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. పేరు ఫ్యూచర్‌సిటీ అయినా లబ్ధి పొందుతున్నది మాత్రం ముఖ్యమంత్రి.. ఆయన అనుకూల సంస్థలు మాత్రమే అని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతుల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి తద్వారా రైతులతో సెటిల్మెంట్ చేసుకుని ముఖ్యమంత్రి రూ. కోట్లు గడించేందుకు కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారన్నారు.
గత కేసీఆర్ హయాంలో 16 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉంటే 28 నెలల కాంగ్రెస్ పాలనలో కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని.. రైతులను మోసం చేస్తూ ఆ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.