సిటీ బ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుండటం అభినందనీయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించిన తీరు ప్రత్యేకమన్నారు. రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని కొనియాడారు.
రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్కు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినా నగరంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతుండటం అభినందనీయమన్నారు. కష్టకాలంలోను పార్టీ వెంటే నిలబడ్డ కార్పొరేటర్లకు భవిష్యత్తులో మర్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి అందరిని గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈనెల 29న జరగనున్న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని కార్పొరేటర్లను కోరారు. కార్యక్రమానికి సంబంధించి నగరంలో చేసే ఏర్పాట్లపై సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ వివరించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ దీక్షా ప్రాధాన్యాన్ని ప్రజలందరికి మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది.