అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు..పుష్కలంగా తాగునీరు… రెప్పపాటు పోని కరెంటు సరఫరా… జాతీయ-అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులతో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు… ఇవీ బీఆర్ఎస్ పాలనకు నిదర్శనం. నిత్యం మత విద్వేషాలు… చీటికిమాటికి కులాల కుంపట్లు… రోత పుట్టించే కరెంటు కోతలు… పరిశ్రమలకు పవర్ హాలిడేలు.. ఇదీ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అనుభవాలు.
గులాబీ పార్టీని ఆదరిస్తే అభివృద్ధి! కాంగ్రెస్‌కు ఓటేస్తే అల్లకల్లోలం!!మీరే తేల్చుకోండి
గత కొన్నిరోజులుగా గ్రేటర్‌వ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో ఆయన ప్రసంగ సారాంశం. అందరికంటే అభ్యర్థులను ముందుగా ఖరారు చేయడంతో పాటు ఇప్పటికే మూడు, నాలుగు దఫాలుగా ప్రచారాన్ని ముగించిన బీఆర్ఎస్ అభ్యర్థులకు కేటీఆర్ రోడ్‌షో మరింత బూస్ట్నిస్తున్నది. ముఖ్యంగా గత తొమ్మిదిన్నరేండ్లుగా హైదరాబాద్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే ముందుంచడంలో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు.
అందుకే ఆయన్ని యూత్ తమ ఐకాన్‌గా భావిస్తారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రోడ్‌షోలతో ప్రధానంగా యువత నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. ఒకవైపు స్థానిక సమస్యలు-పరిష్కారాలను ప్రస్తావిస్తూనే… ఓటర్లు కాస్త ఏమరుపాటు ప్రదర్శించినా భవిష్యత్తులో ఎదుర్కొనే కష్ట నష్టాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. దీంతో అసలే ప్రచారంలేని విపక్ష పార్టీ అభ్యర్థులకు రోడ్‌షోలు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీ ప్రచారం మరో స్థాయికి వెళ్లింది. రెండు నెలల కిందటే అభ్యర్థుల ఖరారుతో ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటి ప్రచారం పలు దఫాలుగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ రోడ్‌షోల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అభివృద్ధి మంత్రంగానే సాగింది. ఇదే తరుణంలో కాంగ్రెస్, బీజేపీల్లో ప్యారాచూట్ అభ్యర్థుల ఖరారుతో ఆ పార్టీల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. దీనికి తోడు ఆ పార్టీల్లో టికెట్ల లొల్లి ముదిరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగాయి. దీంతో గ్రేటర్ పరిధిలో విపక్షాల అభ్యర్థుల ప్రచారంలో పట్టుమని పది మంది నిజమైన కార్యకర్తలు కనిపించక వార్ వన్‌సైడ్‌లా మారింది.
నయా జోష్..
గ్రేటర్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రచారం పీక్ స్టేజీకి వెళ్లింది. ఈ నెల 15న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు మొదలయ్యాయి. ఇది విపక్ష పార్టీల అభ్యర్థులకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డైట్లెంది. అసలే తమ వైపు సరైన ప్రచారం లేదని ఆవేదన చెందుతున్న ఆ పార్టీల నేతలకు కేటీఆర్ రోడ్‌షోలకు వస్తున్న స్పందనతో దింపుడు కల్లం ఆశలు కూడా గల్లంతయ్యాయి. కాగా కేటీఆర్ తన ప్రసంగంలో సూటిగా రెండు అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధిలో వచ్చిన విప్లవాత్మక పురోగతిని వివరిస్తుండగా… మరోవైపు ప్రజలు ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా కాంగ్రెస్ వస్తే గతంలోని కష్టాలు మళ్లీ వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రేటర్‌లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, గోషామహల్, సికింద్రాబాద్‌లో రోడ్‌షోలు పూర్తవ్వగా… సోమవారం నుంచి మరిన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు కొనసాగనున్నాయి.
తొమ్మిదిన్నరేండ్లలో మునుపెన్నడూలేని విధంగా ఎస్ఆర్డీపీ కింద నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, తీగల వంతెన, జంక్షన్లు… ఇలా నగరవాసి గతంలో నిత్యం అనుభవించే ట్రాఫిక్ నరకానికి ఎలా చెక్ పెట్టామో చెబుతున్నారు.
ఎస్ఎన్డీపీ కింద ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం… ఇకముందు కూడా ఎక్కడా
ఈ బాధ లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఐటీ రంగంలో బెంగళూరుకు ధీటుగా ఎదిగి.. టెక్నికల్ ఉద్యోగ కల్పనలో ఆ నగరాన్ని వెనక్కి నెట్టడమనేది యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. ఇదే వాస్తవాన్ని కేటీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన
కనిపించింది.
గత తొమ్మిదిన్నరేండ్లలో హైదరాబాద్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడాన్ని కూడా కేటీఆర్ ప్రజల ముందు ఉంచుతున్నారు.
కాంగ్రెస్ వెంటే కష్టాలు..
కేటీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించే అంశాల్లో కాంగ్రెస్ పాలనలోని కష్టాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కరెంటు కోతలతో పవర్ హాలిడేలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల కష్టాలను వివరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే హైదరాబాద్ కర్ఫ్యూ నీడలో గడుపుతుందనే చరిత్రను ప్రజల ముందు ఉంచుతున్నారు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సామాన్య జనం జీవన ప్రమాణాలపై అవెలా ప్రభావం చూపుతాయో ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కుల, మత కుంపట్లపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచిస్తున్నారు.
స్థానిక అంశాలకూ ప్రాధాన్యతనిస్తూ..
కేటీఆర్ తన ప్రసంగంలో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రత్యర్థులపై పంచులు, సెటైర్లు వేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పర్యటనలో పాల్గొన్న కేటీఆర్… నిత్యం జనాల్లో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి ఎన్నికల కోసం జనాల్లోకి వచ్చారన్నారు. ఈయన అసలు పేరు వన్‌మంత్ రెడ్డి అని, ఆయన ఈ ఒక్క నెలనే జనాలకు కనిపిస్తాడని, ఆ తర్వాత దగ్గరికి రానివ్వడంటూ సెటైర్ వేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా యూపీలో గెలవని అజారుద్దీన్ హైదరాబాద్‌లో గెలుస్తాడా? అంటూ ప్రసంగించి.. జనాలను ఆకట్టుకున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి తొమ్మిదేళ్లలో వచ్చిన మార్పులను ప్రశంసించారు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ దరిద్రులకు మాత్రం నచ్చడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గోషామహల్ పర్యటనలో భాగంగా.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊదరగొట్టే బీజేపీకి సమాధానమిచ్చారు. గోషామహల్లో నందకిశోర్ గెలుపు… రాష్ట్రంలో కేసీఆర్ గెలుపుతో ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు.
సికింద్రాబాద్ పర్యటనలో పాల్గొన్న కేటీఆర్… మాస్ లీడర్ పజ్జన్నను ఆకాశానికి ఎత్తేశాడు. గతంలో ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేగా గెలిచినా.. ఏ ఒక్కరూ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదని..ఎన్నో ఏళ్ల సికింద్రాబాద్ ప్రజల కలను నెరవేర్చిన బీఆర్ఎస్ పాలన తీరును వివరిస్తూ ఆకట్టుకున్నారు.