మేడ్చల్, ఏప్రిల్11(నమస్తే తెలంగాణ): ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ముందుస్తు సన్నాహక సమావేశాలను మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కూకట్పల్లి నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు నిర్వహించి క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయగా, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.
నేడు ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహిస్తుండగా, ఈ నెల 13 మల్కాజిగిరి, 14న మేడ్చల్ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ‘రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరిలివెళ్తాం. జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ భారీ సంఖ్యలో సభకు తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు..’ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ‘మల్కాజిగిరిలో 13న జరిగే సన్నాహక సమావేశానికి కేటీఆర్ రానున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గంలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు ఉంటాయి.’ అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.