సిటీబ్యూరో, అక్టోబర్ 9 ( నమస్తే తెలంగాణ ) : సామాన్యులకు నష్టం చేకూర్చేల నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్‌పై గులాబీ దండు సైరన్ మోగించింది. అడ్డగోలుగా పెంచిన చార్జీలపై బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కింది. చీటికి మాటికి చార్జీలను పెంచడం కాంగ్రెస్ సర్కారు అసమర్థతేనంటూ నినదించింది. ప్రయాణికులపై భారం మోపడాన్ని ఆక్షేపిస్తూ గులాబీ శ్రేణులతో కలిసి చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టి సర్కారు వెన్నులో వణుకు పుట్టించింది.
ఈ నిరసనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సైన్యం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు కదిలి ముట్టడిని విజయవంతంగా పూర్తి చేసింది. హౌస్ అరెస్టులతో, పోలీస్ స్టేషన్లకు తరలింపు వంటి చర్యలతో పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ నేతలు, కార్యకర్తలు వెనకడుగు వేయలేదు.
కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ను పోలీసులు ఉదయమే హౌస్ అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను గృహ నిర్బంధం చేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని హౌస్ అరెస్టు చేయగా, ఆయన ఆ తర్వాత బస్సులో ప్రయాణించి బస్‌భవన్‌కు చేరుకున్నారు.
మల్కాజిగిరి చౌరస్తాలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ..పెరిగిన చార్జీలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత బస్సులో ప్రయాణించి బస్‌భవన్‌కు వెళ్లారు. బస్సులో ప్రయాణిస్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవీలను పోలీసులను అంబర్‌పేట వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ను బస్‌భవన్ వద్ద పోలీసులు కొద్దిసేపు అడ్డుకొని ఆ తర్వాత అనుమతించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే తలసాని క్యాంపు కార్యాలయం నుంచి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావులు బస్ భవన్‌కు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బస్ భవన్‌కు వెళ్లారు.
ఆ పరిసరాలన్నీ రణరంగం
కాగా బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి బస్ భవన్ వరకు మోహరించారు. ఓ వైపు బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా బస్ భవన్ వరకు తరలివస్తుండగా పోలీసులు ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్ భవన్ పరిసరాలన్నీ రణరంగంగా మారాయి.
కేటీఆర్, హరీష్ రావులు వివిధ మార్గాల నుంచి క్రాస్రోడ్డుకి చేరుకున్నాక పోలీసులు భారీ సంఖ్యలో వారిని బస్ భవన్ మార్గంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బారికేడ్లను తప్పించి కేటీఆర్, హరీష్‌రావులు, ఎమ్మెల్యేలు బస్‌భవన్ మార్గంలోకి వెళ్లారు. కొంత దూరం వెళ్లాక మళ్లీ పోలీసులు బారికేడ్లతో మరో వలయం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మళ్లీ తోపులాట జరిగింది.
ఆ వలయాన్ని సైతం తప్పించి ముందుకు కదలడంతో ఒక్కసారిగా కేసీఆర్ జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ సైనికులు పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడంతో పోలీసులు వారిని అనుమతించకుండా ఉండలేని యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీంతో కేటీఆర్, హరీష్‌రావు, పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, దేశపతి శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, వాణీదేవి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులను అనుమతించారు. బస్సు ఛార్జీలను తగ్గించాలని కోరు తూ ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందించారు.
నెట్టేసి..ఈడ్చిపడేసి..కిందపడేసి
చలో బస్ భవన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. శాంతియుత ధోరణితో బస్ భవన్ వైపు తరలివస్తున్న గులాబీ శ్రేణలను పోలీసులు దారుణంగా ఈడ్చిపడేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు ఈడ్చిపడేశారు. వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా తలకు డోర్ తగులుతున్నా పట్టించుకోకుండా లోపలికి తీసేశారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్ తలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. మహిళా కార్యకర్తలను నెట్టేస్తూ వారిని బారికేడ్లు దాటకుండా అడ్డుకున్నారు. మీడియాపై సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్టులను కవరేజీ చేయకుండా తోసిపడేశారు. జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరించిన తీరును జర్నలిస్టుల సంఘాలు ఖండించాయి.
హౌజ్ అరెస్టులతో మరింత దూకుడు..!
బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు ముందస్తుగానే వారిని హౌస్ అరెస్టు చేశారు. దీంతో చలో బస్‌భవన్ కార్యక్రమం ముగిసినట్టేనని అందరూ భావించారు. కానీ కేటీఆర్, హరీష్‌రావులు పోలీసుల వలయాన్ని ఛేదించి బస్ భవన్ బాట పట్టారు. కేటీఆర్ రేతిఫైల్ నుంచి బస్సులో ప్రయాణించగా, మెహిదీపట్నం నుంచి హరీష్ రావు ఆర్టీసీ క్రాస్ రోడ్డు చేరుకున్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమప్రాంతం నుంచి బస్‌భవన్‌కు వస్తున్న తరుణంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి నుంచి మర్రిరాజశేకర్ రెడ్డి బస్సులో వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంబీపూర్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఛార్జీలు తగ్గేలా చేయండి…!
బస్సులో ప్రయాణించిన హరీష్‌రావు, కేటీఆర్‌లతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తమ కష్టాలను పంచుకున్నారు. స్వాతి అనే ఓ యువతి మాట్లాడుతూ.. “బస్సులన్నీ ఫుల్‌గా వస్తున్నాయి. ఎక్కడానికి ప్లేసే లేదు. చాలా కష్టమవుతుంది సార్. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదు. పరుగెత్తుకుంటూ బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఉచితబస్సు ఎవ్వరు అడిగారు. ఉచిత ప్రయాణం ఇస్తే అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలే కదా. డ్రైవర్లు, కండక్టర్లు మాకు గౌరవం ఇవ్వడం లేదు. ఉచిత బస్సు అని చీప్‌గా చూస్తున్నారు” అంటూ ఆవేదన పంచుకుంది. మరో విద్యార్థి శాంతిరాజు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి తమను మోసం చేసిందని చెప్పాడు. బస్సు పాస్ ధరలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో విద్యార్థి తమ బస్ పాస్ నెలకు 1300 ఉంటే రూ.300 పెంచి 1600లు చేశారని హరీష్ రావుకు తెలిపాడు. రేవంత్ ఇచ్చిన హామీలన్నీ బిస్కెట్లే అంటూ పేర్కొన్నారు.