సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ ) : అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నేటి (జూన్ 25) నుంచి క్యూర్ పరిధి (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)లో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్/సర్) కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు గురువారం నేటి నుంచి వచ్చే నెల (జూలై) 24వ తేదీ వరకు ప్రతి ఇంటిని సందర్శించనున్నారు.
ముందస్తుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారంలతో వచ్చే అధికారులు, ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో స్వయంగా సరిచూసుకోనున్నారు. నివాసాలు మారిన వారు, ఒకే ఓటరు ఒకటి కంటే ఎకువ చోట్ల నమోదై ఉండటం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి లోపాలను గుర్తించి ఈ సర్వే ద్వారా సరిదిద్దుతారు. అనంతరం జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ తర్వా త అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. వచ్చే అక్టోబర్ 1, 2026 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
రాజకీయ పార్టీలు అప్రమత్తం
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సర్ ప్రక్రియపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఓటర్ల జాబి తా సవరణలో తమ అనుకూల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవడం, కొత్త ఓట్లను భారీ గా నమోదు చేయించడంపై పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇంటింటి సర్వే సమయంలో బీఎల్ఓల వె ంట తమ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులు కూడా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మూడు కా ర్పొరేషన్ల పరిధిలో ఉ న్న బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులకు ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్, ప్రతి బూత్ పరిధిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని, అర్హులైన వారి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ఓట్ల తొలగింపు లేదా మార్పులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, పార్టీ పరంగా ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన శ్రేణులకు సూచించారు.
సర్వే ఎలా జరుగుతుందంటే ?
బీఎల్ఓలు ప్రతి ఇంటికీ రెండు కాపీల ముందస్తు ముద్రిత ఎన్యుమరేషన్ ఫారంలతో వస్తారు. ఒక కాపీని తమ వద్ద ఉంచుకుని, మరో అక్నాలెడ్జ్ మెంట్ కాపీని ఓటరుకు అందజేస్తారు. ఒకవేళ బీఎల్ఓ వచ్చే సమయానికి ఇంట్లో ఓటరు అందుబాటులో లేకపోతే, కుటుంబంలోని ఎవరున్నా ఆ ఫారం పూర్తి చేసి సంతకం చేయవచ్చు. ఈ ప్రక్రియలో బీఎల్ఓలు కనీసం 3 సార్లు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఆన్ లైన్లో కూడా https://voters.eci. gov.in వెబ్ సైట్లో ఓటర్లు తమ వివరాలను నమోదు లేదా సరిచూసుకోవచ్చు.
ఆధార్ తప్పనిసరి కాదు..
ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికం (సదరు ఓటరు ఇష్టపడితేనే ఇవ్వవచ్చు). ఓటరు జాబితాలో పాత లేదా తప్పు ఫొటో ఉంటే, ఫారంలోని నిర్దేశిత స్థలంలో కొత్త పాస్ పోర్ట్ సైజు ఫొటోను అతికించి సరిచేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు తమ పేరు నమోదు కోసం ఫారం-6 ను పూర్తి డిక్లరేషన్‌తో బీఎల్ఓకు సమర్పించాలి. మరో ప్రాంతానికి మారిన వారు జూలై 31న ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత ఫారం- 8 ద్వారా చిరునామా అప్డేట్ చేసుకోవచ్చు. సాధారణ ఎన్యుమరేషన్లో ఎలాం టి పత్రాలు అవసరం లేదు.
కానీ ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ఓటరు అర్హతపై ఎన్నికల నమోదు అధికారికి అనుమానం వస్తే నోటీసు జారీ చేస్తారు. అప్పుడు తన అర్హతను నిరూపించుకోవడానికి పత్రాల్లోఏదైనా ఒకటి సమర్పించాలి. అర్హులైన ప్రతి ఒకరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటర్ల జాబితాలో తమ పేర్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. నివాస ప్రాంతంలో బీఎల్ఓల సమాచారం లేదా ఇతర వివరాల కోసం https://ceotelangana.nic.in వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు.