జూబ్లీహిల్స్, డిసెంబర్14: క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా, అధికారికంగా గుర్తించింది కేసీఆర్ సర్కారేనని…డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలబ్రేషన్స్‌కు కూడా సెలవు ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని చర్చీలకు రూ.3 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు.
శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్‌లోని ఎస్పీఆర్హిల్స్ గ్రౌండ్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్‌చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం, 43 ఎకరాల్లో శ్మశానవాటికల కోసం స్థలాల కేటాయింపు తదితర అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
జూబ్లీహిల్స్ యూనైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రతినిధులు బిషప్ విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో స్టీఫెన్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.