మేడ్చల్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి వంద మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో రూ.250 కోట్లతో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ఆయన మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం 3,169 మంది లబ్ధిదారులకు జీవో 58 ద్వారా ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధానికి శాశ్వతంగా చెక్ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తడి చెత్త నుంచి ఎరువును తయారు చేస్తున్నామని, పొడి చెత్త నుంచి ఇప్పటికే 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. మరో 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూ. 550 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు జరుగుతున్నాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ఉత్పత్తి కేంద్రం జవహర్‌నగర్‌లోనే ఉందని అన్నారు. దేశంలోనే ఆదర్శనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని, తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.250 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్(లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను సహచర మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. జవహర్‌నగర్‌లో చెత్తను అత్యాధునిక పద్ధతిలో శాస్త్రీయంగా శుద్ధి చేస్తామన్నారు. తద్వారా డంపింగ్‌యార్డు నుంచి వచ్చే దుర్గంధానికి శాశ్వతంగా చెక్ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే చెత్తను వేర్వేరుగా చేస్తామని, అందులో తడి చెత్త నుంచి ఎరువును తయారు చేస్తున్నామని, పొడి చెత్తతో ప్రస్తుతం డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదన్నారు. త్వరలోనే మరో 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసేలా రూ.550 కోట్ల నిధులతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
త్వరలోనే పనులు పూర్తయి మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, డంపింగ్ యార్డుకు వచ్చిన చెత్త ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్నదన్నారు. జవహర్‌నగర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసిన సమయంలో మొదటగా హైదరాబాద్ నుంచి ప్రతి నిత్యం మూడు వేల మెట్రిక్ టన్నులు వచ్చేదని, ప్రసుత్తం అది మూడింతలు పెరిగి 8 వేల మెట్రిక్ టన్నులకు చేరిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తూ శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం జవహర్‌నగర్‌లోనే ఉందని వివరించారు. దుండిగల్‌తో పాటు మరిన్ని ప్రాంతాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి ఒక్కో చోటకు 1,500 టన్నుల చెత్తను తరలిస్తున్నామని, దీనివల్ల జవహర్‌నగర్‌లో కొంత ఇబ్బంది తగ్గిందని తెలిపారు. మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్(లీచెట్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్) నిర్మాణంతో చెత్త నుంచి వచ్చే మురుగు నీరు శుద్ధి జరిగి మంచి నీటిగా బయటకు వస్తాయన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ సమస్య వారసత్వంగా తమ ప్రభుత్వానికి వచ్చినట్లయిందన్నారు. అయినప్పటికి చిత్తశుద్ధితో జవహర్‌నగర్ ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పేదలకు ఇండ్ల స్థలాలు..
పేదలకు ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు అందజేస్తామన్నారు. నేడు అర్హులైన 3,169 మందికి ఇండ్ల పట్టాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59 జీవోకు సంబంధించి కటాఫ్ 2014 వరకు ఉంటే మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం వల్ల దానిని 2020 వరకు పొడిగించి అప్పటి వరకు అర్హులైన వారికి పట్టాలు అందిస్తున్నామన్నారు.
ఇండ్లు కట్టుకునే వారికి 3 లక్షలు మంత్రి మల్లారెడ్డి
ఖాళీ స్థలాలు ఉండి ఇండ్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు అందించే విధంగా కృషి చేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అనేక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2024లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జవహర్‌నగర్ మేయర్ కావ్య, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, దమ్మాయిగూడ చైర్మన్ ప్రణీత, కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీవో రవి, గౌతమ్‌రెడ్డి, రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
శుద్ధీకరణ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలి ;మంత్రి కేటీఆర్
మేడ్చల్, ఏప్రిల్15(నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంప్ యార్డు నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్(మురికినీరు) శుద్ధీకరణ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జవహర్‌నగర్‌లో డంపింగ్‌యార్డులో రూ. 251 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 2వేల ఎల్డీ సామర్థ్యం గల లీచెట్ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్‌కుమార్, రాంకీ సంస్థ చైర్మన్, ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంత ప్రజలకు కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు మల్కారం చెరువు శుద్ధి ప్లాంట్‌ను త్వరలోనే పూర్తి చేయాలని సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. మల్కారం చెరువు శుద్ధిని సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని మంత్రికి రాంకీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. 30 ఎకరాల్లో విస్తరించిన మల్కారం చెరువు లీచెట్ ట్రీట్మెంట్ పూర్తి చేస్తామని వివరించగా.. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా మల్కారం చెరువును శుద్ధి చేయాలని, అప్పుడు మళ్లీ వచ్చి పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ పీఎం కావాలే ;జవహనగర్ వాసి కేతమ్మ
కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ సీఎం కావాలే అదే మా కోరిక..కేసీఆర్ సల్లగ బతకాలే..కేటీఆర్ ముఖ్యమంత్రి అయి జవహర్‌నగర్‌కు రావాలే అని జవహర్‌నగర్‌కు చెందిన కేతమ్మ సంబురంగా చెప్పారు. పట్టాల పంపిణీ సభలో ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు. జవహర్‌నగర్‌లో కంచెలు, పాములు, తేళ్లు ఉండే. దగ్గర గుడిసెలు ఏసుకుని కష్టపడి బతికినం. కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. చెప్పినట్టుగానే ఇండ్ల పట్టాలను ఇచ్చేందుకు వచ్చాడు. గల్ల ఎగిరేసి చెప్తున్నం. మాకు పనులన్నీ కేసీఆర్ సార్‌ను ముందు పెట్టి మంత్రి మల్లన్న పనులు చేయిస్తుండు. ఆడపిల్ల పుట్టిందటే భారం అవుతుంది. అలాంటిది ఒక ముసలోడు చెప్పిండు. తనకు 7 గురు ఆడబిడ్డలు ఉంటే కల్యాణలక్ష్మితో 8 లక్షలు వచ్చాయి అని. ముసలోడు సంబరపడ్డడు. ముసలోల్లకు ఆసరా పింఛన్లు వస్తున్నాయి. తెలంగాణ రాజ్యం వచ్చాక ఎక్కడ చూసిన నీళ్లే ఎక్కడ చూసిన గంగె కనిపిస్తున్నాయి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. కేతమ్మ మాట్లాడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి కేతమ్మను ఆత్మీయంగా హత్తుకుని సన్మానం చేశారు.