సౌదీ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ముషీరాబాద్ ప్రాంత కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సిటీ బ్యూరో, ముషీరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): సౌదీ అరేబియా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ముషీరాబాద్ ప్రాంత కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీంతో విద్యానగర్లోని వారి నివాసానికి వెళ్లి మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటన దురదృష్టవరమని, ఒకే కుటుంబలోని 18 మంది చనిపోవడం తనను కలచివేసిందని అన్నారు. అందులో తొమ్మిది మంది చిన్నపిల్లలు మరణించడం బాధాకరమన్నారు. మృతదేహాల తరలింపునకు అవసరమైన సహాయం బీఆర్ఎస్ పార్టీ తరపున అందిస్తామని, ఇప్పటికే తమ పార్టీ బృందం సౌదీ అరేబియాకు వెళ్లిందన్నారు. బాధిత కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా ఉందని, సౌదీ అరేబియాకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులకు తోడ్పాటునందించడానికి బీఆర్ఎస్ బృందం వెళ్లిందన్నారు. మహమూద్ అలీ కుమారుడు అజంఅలీ, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీయుల్లా ఖాన్ తదితరులు సౌదీలోని అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారని వెల్లడించారు.
బాధిత కుటుంబాలకు ఏ రకమైన సహాయం కావాలన్నా స్థానిక నాయకత్వం తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మశాంతి కలుగడానికి శుక్రవారం అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిపారు. పార్థివ దేహాలను వీలైతే తరలించడానికి ఏర్పాట్లు చేయాలని, లేకపోతే అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి అంతిమ సంస్కారం చేయడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం బీఆర్ఎస్ బృందంతో పాటు పార్టీ ఎంపీలను భారత దౌత్య అధికారులతో సంప్రదించాల్సిందిగా కోరతామన్నారు. కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎంఎన్ శ్రీనివాస రావు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.