సుల్తాన్‌బజార్, మే 2: ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు మృత్యువాత పడటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా మార్చురీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు పార్దీవదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి..నివాళులర్పించారు.
అనంతరం మార్చురీ వద్ద ఉన్న మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాగా, ఉస్మానియా దవాఖానలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన అనంతరం వారి స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను తరలించే వరకు కేటీఆర్ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.