సిటీబ్యూరో, సెప్టెంబరు 24(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలో బుధవారం పర్యటించనున్నారు. గ్రేటర్‌కు సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో కేటీఆర్ పర్యటిస్తారు. తొలుత ఫతేనగర్‌లో 133 ఎంఎల్డీ సామర్థ్యంతో జల మండలి నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)ను కేటీఆర్ సందర్శిస్తారు. అనంతరం, కూకట్పల్లి ఎస్టీపీని సందర్శించి అక్కడ నుంచి ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడనున్నారు.
మురుగునీటి ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు బీఆర్ఎస్ బాటలు వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను మరింత జటిలం చేసే తీరును ఎండగట్టనున్నారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 31 ఎస్టీపీలను 27 చోట్ల చేపట్టి కోకాపేట, దుర్గం చెరువు ఎస్టీపీలను అసెంబ్లీ ఎన్నికల ముందే వినియోగంలోకి తెచ్చారు.
మొత్తం ఎస్టీపీ పనులను వేగవంతం చేసి ఈ ఏడాది జూన్ చివరి నాటికల్లా ప్రాజెక్టు పూర్తి ఫలాలను తీసుకురావాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు లక్ష్యాలను ఖరారు చేసింది. విడతల వారీగా అందుబాటులోకి వచ్చే ఎస్టీపీలను కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేసింది. పార్లమెంట్ ఎన్నికల ముందు సిద్ధంగా ఉన్న ఆరు ఎస్టీపీలలో కేవలం మూడు ఎస్టీపీలను మాత్రమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఐతే, గడిచిన 10 నెలలుగా ఆ తర్వాత అధికారికంగా పురోగతిలో ఉన్న ఎస్టీపీలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యానికి నీళ్లొదిలి.. కనీసం ట్రయల్ రన్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న ఎస్టీపీలను అధికారికంగా ప్రారంభించలేదు. ఫలితంగా గ్రేటర్లో మురుగునీటి ముంపు సమస్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. మున్సిపల్, వ్యవహారాల శాఖలు తన వద్దనే ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఎస్టీపీలను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలం అయ్యారని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.